గ్రామాల్లోనూ ఉపాధి | Sakshi
Sakshi News home page

గ్రామాల్లోనూ ఉపాధి

Published Wed, Aug 20 2014 12:10 AM

గ్రామాల్లోనూ ఉపాధి

  •  కల్వర్టు, డ్రైనేజీ నిర్మాణాలకు ప్రతిపాదన
  •  పల్లెల్లో మెరుగుపడనున్న పారిశుద్ధ్యం
  •  అభివృద్ధి చెందనున్న గ్రామాలు
  • పేదలను ఆదుకుంటున్న ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం గ్రామాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే భూ అభివృద్ధి పనులతో వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసేందుకు  అంగీకరించగా, తాజాగా గ్రామాల్లో కల్వర్టుల నిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుకు ప్రతిపాదిస్తున్నారు.
     
    నర్సీపట్నం రూరల్ : గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఒక పక్క రైతులకు ప్రయోజనకరంగా ఉండే భూ అభివృద్ధి పనులతో పాటు వ్యవసాయానికి అనుసంధానంగా పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ పనులపై స్పష్టత రావడంతో ఇక గ్రామాల అభివృద్ధి పనులపై దృష్టిసారించనున్నారు.

    గ్రామాలకు సంబంధించి గతంలో పంచాయతీ భవనాలు, రోడ్లు, కల్వర్టులు, డ్రైనేజీ  తదితర పనులు చేపట్టగా కొన్ని గ్రామాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో పాటు ఏజెన్సీలో కూలీల స్థానే యంత్రాలు వినియోగించడంతో ఈ పథకం ఆశయం దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పట్లో ఈ పనులు నిలిపివేశారు. ప్రస్తుతం గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితి దయనీయంగా మారింది. గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేవలం తాగునీరు, విద్యుత్ వినియోగానికే సరిపోతున్నాయి. రోడ్లు వేసినా డ్రైనేజీలు లేని దుస్థితి.

    ఈక్రమంలో ఎక్కడినీరు అక్కడే నిలిచిపోవడంతో పారిశుద్ధ్యం కొరవడి దోమలు వృద్ధి చెంది పలు వ్యాధులకు గ్రామీణులు గురవుతున్నారు. తాజాగా ప్రభుత్వం కల్వర్టులు, డ్రైనేజీలను విస్తారంగా చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. వాటిని ఏ విధంగా చేపట్టాలనే దానిపై అధికారులతో చర్చిస్తోంది. కేంద్రాన్ని ఒప్పించి గ్రామాల్లో ఉపాధిహామీ అమలుకు ఏర్పాట్లు చేస్తోంది.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement