సేవలకు సెల్యూట్..! | Sakshi
Sakshi News home page

సేవలకు సెల్యూట్..!

Published Wed, Apr 2 2014 4:24 AM

Salute to the Services ..!

కర్నూలు, న్యూస్‌లైన్: పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న పది మంది సిబ్బందికి సేవ, ఉత్తమ సేవ, కఠిన సేవా పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరి జాబితాను మంగళవారం ప్రభుత్వం విడుదల చేసింది. పన్నెండేళ్ల సర్వీసు పూర్తి చేసి ఐదు సంవత్సరాల సర్వీసు వరకు ఎలాంటి ఆరోపణలు లేని వారికి సేవ పతకం.. అలాగే 17 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి సేవా పతకం పొందిన వారికి ఉత్తమ సేవా పతకం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కఠినమైన సేవలందించిన సిబ్బందికి కఠిన సేవా పతకాన్ని ప్రకటించింది.
 
 
  జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ విభాగంలో ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లకు, ఏపీఎస్పీ రెండో పటాలంలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు, అవినీతి నిరోధక శాఖ కర్నూలు రేంజ్ కార్యాలయంలో పని చేస్తున్న కానిస్టేబుల్‌కు సేవా పతకాలు దక్కాయి. ఉల్లిందకొండలో పని చేస్తున్న కానిస్టేబుల్‌కు ఉత్తమసేవా పతకం, గ్రేహౌండ్స్ ఆక్టోపస్ విభాగాల్లో పని చేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కఠిన సేవా పతకాలు దక్కాయి.
 
 సేవాపతకాలు లభించింది వీరికే...
 రెండో పటాలంలో ఆర్.చిన్న వీరనాగిరెడ్డి(హెచ్‌సి. 531) హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. చాగలమర్రి మండలం బి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈయన 1982లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసువిభాగంలో విధుల్లో చేరారు. వచ్చే ఫిబ్రవరికి పదవీ విరమణ పొందనున్నారు.
 ఏపీఎస్పీ రెండో పటాలంలో బి.గంగాధరరాజు హెడ్ కానిస్టేబుల్(హెచ్‌సి.10099)గా పని చేస్తున్నారు. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన గంగాధర్ రాజు 1983లో ఏపీఎస్పీలో విధుల్లో చేరారు.
 
 అవినీతి నిరోధక శాఖ కర్నూలు రేంజ్ కార్యాలయంలో  కేత నాగరాజు(పీసీ 1857) పని చేస్తున్నారు. కర్నూలు నగరం తెలుగు గేరిలో నివాసముంటున్న నాగరాజు 1998లో పోలీస్ శాఖలో చేరారు. నందికొట్కూరు, శ్రీశైలం, కర్నూలు ట్రాఫిక్, జిల్లా పోలీసు కార్యాలయం కంప్యూటర్స్ విభాగం, ఈకాప్స్ కార్యాలయాల్లో పని చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను 94 రివార్డ్స్ పొందారు. అందులో 36 క్యాష్ రివార్డ్స్ ఉన్నాయి. గుడ్ సర్వీస్ ఎంట్రీలు కూడా ఉన్నాయి. 2009 నుంచి ఏసీబీ విభాగంలో పని చేస్తున్నారు.
 
 జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ విభాగంలో ఎ.ఆదినారాయణ హెడ్‌కానిస్టేబుల్(హెచ్‌సి. 1160)గా పని చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి స్వగ్రామం కాగా ఈయన తండ్రి పోలీసు శాఖలో పని చేస్తూ కర్నూలులోనే స్థిర పడటంతో ఆదినారాయణ కూడా కర్నూలులోని ఏపీఎస్పీ క్యాంప్‌లో నివాసముంటున్నాడు. 1979లో పోలీస్ శాఖలో చేరారు. మరో మూడేళ్లు సర్వీస్ ఉంది. స్పోర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ విభాగంలోని ఎంటీ సెక్షన్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
 
 కర్నూలు నగరం కొత్తపేటలోని సాయిబాబా సంజీవయ్య నగర్‌కు చెందిన అయ్యన్న(ఏఆర్ హెచ్‌సి.379) 1984లో పోలీసు శాఖలో విధుల్లో చేరారు. మరో నాలుగేళ్ల పాటు సర్వీసు ఉంది. ఫ్యాక్షన్ జోన్‌లో పని చేసేటప్పుడు ఈయన దాదాపు 60 రివార్డులు అధికారుల నుంచి అందుకున్నారు. ప్రస్తుతం ఏఆర్ విభాగంలో బ్యాండ్ సెక్షన్‌లో పని చేస్తున్నారు.
 
 ఏఆర్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీరాములు(హెచ్‌సి 1776) 1980లో పోలీసు శాఖలో విధుల్లో చేరారు. కర్నూలు నివాసియైన ఈయన ప్రస్తుతం కర్నూలు రేంజ్ డీఐజీ వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత 30 ఏళ్లుగా ఎస్పీ, డీఐజీ వాహనాలకు డ్రైవర్‌గా పని చేస్తూ అధికారుల వద్ద ప్రశంసలు పొందారు.
 
 ఉత్తమసేవా పతకం..
 ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ జి.రామన్న(పీసీ నం.1836)కు ఉత్తమ సేవా పతకం దక్కింది.  సిమెంట్ నగర్‌కు చెందిన ఈయన 1989లో తూర్పు గోదావరి నుంచి పోలీసు శాఖకు ఎంపికయ్యారు. 1997 వరకు అదే జిల్లాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ శిక్షణలోను పని చేశారు. 1994లో ఇతనికి సేవా పతకం దక్కింది. జిల్లాలోని గడివేముల, బేతంచెర్ల, ఎమ్మిగనూరులో పని చేస్తూ ఇటీవలనే ఉల్లిందకొండకు బదిలీపై వచ్చారు. దాదాపు 60 రివార్డులు, ఆరు ప్రశంస పత్రాలు ఉన్నాయి.
 
 కఠినసేవా పతకాలు..
  ఏపీఎస్పీ రెండవ పటాలానికి చెందిన జె.శివకుమార్(జేసి. 8515),. దుర్గా ప్రసాద్(జేసీ 8517) వీరు ప్రస్తుతం గ్రేహౌండ్స్ విభాగంలో పని చేస్తున్నారు. అలాగే ఎంకె.విశ్వనాథ్‌రెడ్డి(పీసీ నం.2067) ఆక్టోపస్ విభాగంలో పని చేస్తున్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కఠిన సేవా పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. పథకాలను దక్కించుకున్న సిబ్బందిని సహోద్యోగులు, పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు అభినందించారు.
 

Advertisement
Advertisement