కదిలిన ‘సమైక్య’ రథాలు | Sakshi
Sakshi News home page

కదిలిన ‘సమైక్య’ రథాలు

Published Sat, Oct 26 2013 3:32 AM

samaikyandhra supporters are started from eluru

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :
 జోరు వర్షం.. పొంగుతున్న వాగులు, వంకలు.. ఇవేమీ సమైక్య శంఖారావానికి అడ్డుకాలేదు. సమైక్యాంధ్ర పరిరక్షణే ఏకైక లక్ష్యంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా జిల్లానుంచి వేలాది మంది హైదరాబాద్‌కు పయనమయ్యూరు. ఢిల్లీ పెద్దల మెడలు వంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో చేపట్టిన సమైక్య శంఖారావం సభకు జిల్లా నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్దఎత్తున తరలివెళ్లారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాన్ని, తెలంగాణవాదుల హెచ్చరికలను సైతం లెక్కచేయలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎవరు అడ్డుపడినా సభకు వెళ్లి తీరతామని ప్రతినబూని మరీ వేలాది మంది రాజధానికి పయనమయ్యారు.
 
 ఉరిమిన ఉత్సాహంతో...
 సమైక్య శంఖారావం సభకు వెళ్లేందుకు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, కార్మికులు మొదటి నుంచీ ఎంతో ఉత్సాహం చూపారు. లక్షలాది మందిని తీసుకెళ్లడం సాధ్యమయ్యే పనికాకపోవడంతో నియోజకవర్గానికి సుమారు ఐదు వేల మందిని తీసుకెళ్లాలని వైఎస్సార్ సీపీ నేతలు భావించారు. ఏయే గ్రామాల నుంచి ఎవరు వస్తున్నారనే వివరాలను ముందుగానే నమోదు చేసుకుని తగిన ఏర్పాట్లు చేశారు. పది రోజులుగా జిల్లా అంతటా పార్టీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేశారు. సభకు ఎలా వెళ్లాలనే దానిపై గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకూ సమావేశాలు నిర్వహించుకున్నారు.
 
 గ్రామగ్రామానా సమైక్య రథాలు
 శంఖారావానికి వెళ్లే డెల్టా ప్రాంత అభిమానులు, ప్రజల కోసం నరసాపురం నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంట లకు అది నరసాపురం నుంచి బయలుదేరింది. దీంతోపాటు పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఆచంట నియోజకవర్గాల నుంచి వందల సంఖ్యలో బస్సులు శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్ బయలుదేరాయి. జిల్లా కేంద్రమైన ఏలూరుతోపాటు దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు నియోజవర్గాల ప్రజల కోసం ఏలూరు నుంచి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆధ్వర్యంలో మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఆ రైలు వేలాది మందితో రాత్రి 10 గంటలకు బయలుదేరింది. మరోవైపు వందల సంఖ్యలో బస్సులు, కార్లలో ప్రజలు హైదరాబాద్ తరలివెళ్లారు. బస్సులను ఆయా గ్రామాలకు శుక్రవారం ఉదయమే పంపించారు. మధ్యాహ్నం నుంచి బస్సులు ఒక్కొక్కటిగా బయలుదేరివెళ్లాయి.
 
 వసతి, భోజన ఏర్పాట్లు
 జిల్లా నుంచి వెళ్లిన వేలాది మంది కోసం రాజధానిలో ఫంక్షన్ హాళ్లు బుక్ చేశారు. ఏ నియోజకవర్గం నుంచి వెళ్లినవారు ఎక్కడ ఉండాలనే విషయాన్ని ముందే వారికి చెప్పారు. అలాగే వాహనాలు ఏ రూటు గుండా వెళ్లాలనే అంశాలనూ వివరించారు. బస్సులు, కార్ల పార్కింగ్‌కు అనువైన ప్రదేశాలను కూడా బస్సులు, కార్లలో వెళ్లే వారికి ముందే చెప్పారు. మరోవైపు సభకు వెళ్లిన వారికి అక్కడే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజన ఏర్పాట్లను కూడా చేశారు.
 
 సాధారణ జనం ఆసక్తి
 సమైక్య శంఖారావం సభకు వెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోపాటు సాధారణ ప్రజలు కూడా ఉత్సాహం చూపారు. ఉద్యోగులు సభకు మద్ధతు ప్రకటించడంతోపాటు కొన్ని వాహనాల్లో వెళ్లారు. రేషన్ డీలర్లు, వ్యాపార సంఘాలతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు కూడా శంఖారావ సభకు పయనమయ్యారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత వర్షం వస్తే ఇబ్బంది లేకుండా చాలామంది గొడుగులు తీసుకెళ్లడం గమనార్హం. శంఖారావం సభకు వెళ్లడం తమ బాధ్యతగా భావించి అంతా బయలుదేరారు.

Advertisement
Advertisement