Sakshi News home page

చేనులవలసలో చెలరేగిపోతున్నారు!

Published Wed, Feb 6 2019 7:28 AM

Sand Load Mafia in Srikakulam - Sakshi

అది పేరుకే ప్రభుత్వ ఇసుక రీచ్‌. అక్కడ దందా అంతా ప్రైవేటు వ్యక్తులదే. వంశధార నది నుంచి ఇసుకను యథేచ్ఛగా తవ్వేసి.. లారీల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులు. నిబంధనలు పాటించాలని చెబుతున్న గ్రామస్థాయి అధికారులపై ర్యాంపు నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదీ నరసన్నపేట మండలం చేనులవలస ర్యాంపు నిర్వహిస్తున్న తీరు.

శ్రీకాకుళం , నరసన్నపేట: వంశధార నదిలో చేనులవలస వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపులో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఎక్కువ కావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ మచ్చుకైనా నిబంధనలు అమలు కావడం లేదు. రాష్ట్రంలో ఇసుక అక్రమ వ్యాపారానికి బాటలు వేసిన బ్లూ ఫ్రాగ్‌ మోబైల్‌ టెక్నాలజీ సంస్థ (మంత్రి లోకేష్‌ వోఎస్‌డీ కిరణ్‌ తండ్రి నేతృత్వంలో నడుస్తున్న సంస్థ) ఈ ర్యాంపును నిర్వహిస్తోంది. దీంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రైవేటు వ్యక్తులు ఇక్కడ దందా నిర్వహిస్తున్నారు.

విశాఖ నగర అవసరాల కోసం..
విశాఖ నగర అవసరాల కోసం జిల్లా కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి ఆదేశాలతో చేనులవలసలో ఇసుక ర్యాంపును అధికారికంగా మైన్స్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇక్కడ 40 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉందని గునులశాఖ అధికారులు గుర్తించారు. ర్యాంపునకు వాహనాలు వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం రూ. 40 లక్షలు వెచ్చించి రోడ్డు సైతం నిర్మించింది. అయితే ఈ రోడ్డును కాదని ప్రైవేటు వ్యక్తులు నదిలో మరో రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. వీఆర్‌ఏ ర్యాంపు వద్ద ఉంటున్నప్పటికీ ఆయన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ర్యాంపు నడుస్తోంది. ఇక్కడ వారు ఆడిందే ఆట.. పాడిందే పాట చందంగా పరిస్థితులు మారాయి. రోజుకు అధికారికంగా వీఆర్‌వో ఇచ్చిన రశీదులతో వెళ్తున్న లారీలు పదైతే,  అనాధికారికంగా ఇసుకను తరలించుకుపోతున్న లారీలు 30 నుంచి 40 వరకూ ఉంటున్నాయి.

ఇలా ఇసుకను అక్రమంగా తరలించుకుపోతుండడం ద్వారా లక్షలాది రూపాయలను ప్రైవేటు వ్యక్తులు వెనకేసుకుంటుండగా..సర్కార్‌ ఖజానాకు మాత్రం చిల్లుపడుతోంది.  ప్రభుత్వ నిబంధనల ప్రకారమైతే క్యూబిక్‌ మీటర్‌కు రూ. 750 తీసుకోవాలి. అయితే రెట్టింపు స్థాయిలో తీసుకుంటున్నారు. అలాగే విశాఖలో కొందరు బిల్డర్లతో ప్రైవేటు వ్యక్తులు నేరుగా స్పంద్రదింపులు చేసి ఇక్కడ నుంచి ఇసుక తరలించి లారీ లోడును రూ. 15 వేల నుంచి రూ. 20 వేలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి సమయాల్లో ఇసుక తరలించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే చేనులవలస ర్యాంపులో ఈ నిబంధన మచ్చుకైనా అమలు కావడం లేదు. రాత్రి వేళల్లోనే అధికంగా లారీలను నదిలో దించి ఇసుకను లోడ్‌ చేసి తరలించుకుపోతున్నారు. ర్యాంపునకు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న బుచ్చిపేట, కొత్తపేట గ్రామాలకు చెందిన ప్రజలు రాత్రి సమయాల్లో ఇసుక తరలిస్తున్న లారీలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. అయితే ప్రైవేటు వ్యక్తులు వారికి నచ్చచెప్పి తమ చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.  

నదిలోనే రోడ్డు ..
జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో రూ. 40 లక్షలు వెచ్చించి చేనులవలస నుంచి ర్యాంపు వరకూ వేసిన రోడ్డును పక్కన పెట్టి నదిలో ప్రత్యేకంగా రోడ్డు వేసి ఇసుకను తరలించుకుపోతున్నారంటే ప్రైవేటు వ్యక్తులకు అధికార పార్టీ నేతల అండ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని ఈ ప్రాంతీయులంటున్నారు. అలాగే సీసీ కెమెరాలు ఒక చోట ఉంటే ఇసుక డంపింగ్‌ మరో చోట చేస్తున్నారు. దీంతో  ఎంత ఇసుక వెళ్తుందో..ఎన్ని లారీలకు లోడ్‌ అవుతుందో నమోదు కావడంలేదు. అధికారికంగా  డంపింగ్‌  స్థలంలో కెమెరాలున్నా అక్కడ నామమత్రాంగానే ఇసుక లోడింగ్‌ అవుతోంది. ఉన్న కెమెరాలు కూడా పని చేస్తున్నాయో.. లేదో అనేది అనుమానాస్పదంగా ఉంది. ఈ మాయ తంతు అంతా బ్‌లైఫ్రాగ్‌ మోబైల్‌ టెక్నాలజీ సంస్థ సిబ్బంది చేస్తున్నారు.  నదిలో యంత్రాలను వినియోగించకూడదనే నిబంధన సైతం ఇక్కడ అమలు కావడం లేదు. రాత్రి వేల పొక్లయినర్లతో ఇసుకను తవ్వేస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement