పర్సంటేజీలే ముద్దు.. | Sakshi
Sakshi News home page

పర్సంటేజీలే ముద్దు..

Published Mon, Feb 4 2019 8:48 AM

SDF Funds Wastage in Visakhapatnam - Sakshi

పనులన్నీ పప్పుబెల్లాల్లా పంచేసుకున్నారు. పర్సంటేజీలు దండేసుకున్నారు. పనులు మాత్రం అంగుళం కదలని పరిస్థితి.. నియోజకవర్గ ఎమ్మెల్యేల ప్రత్యేక అభివృద్ధి నిధులతో (ఎస్‌డీఎఫ్‌) చేపట్టే పనుల్లో పర్సంటేజీల వసూలులో చూపిన శ్రద్ధ్ధ పనుల పురోగతిపై పెట్టకపోవడం వల్లనే పరిస్థితి ఇలా ఉందని చెబుతున్నారు. పైగా నిధులు విడుదల చేయకపోవడంతోనే పనులు జరగడం లేదంటూ కొత్త వాదన తెర పైకి తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు పనుల పరిస్థితితో సంబంధం లేకుండా మంజూరైన ఎస్‌డీఎఫ్‌ నిధులన్నీ విడుదల చేసేయండంటూ కొత్త కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ హుకుం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

సాక్షి విశాఖపట్నం: ఎమ్మెల్యే గ్రాంట్‌తో చేపట్టే ఎస్‌డీఎఫ్‌ పనులు రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా విశాఖ జిల్లాలో నత్తననడకన సాగడమే కాదు.. అత్యంత నాసిరకంగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పార్టీ ఏదైనా ఎమ్మెల్యేలకు మంజూరు చేయాల్సిన ఈ నిధులను ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు ప్రాతిని«ధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జిల పేరిట విడుదల చేసి టీడీపీ సర్కారు కొత్త సంస్కృతికి తెరతీసింది. ఇలా నియోజకవర్గానికి ఏడాదికి కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చొప్పున గడిచిన నాలుగున్నరేళ్లలో జిల్లాకు 108 కోట్లు మంజూరయ్యాయి. వీటికి ఉపాధి హామీ నిధులు రూ.5.13 కోట్లు, ఇతర నిధులు మరో రూ.8.78 కోట్లు జత చేసి మొత్తం 121.91 కోట్లతో 2550 పనులు మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు ఖర్చు చేసింది అక్షరాల 19.60 కోట్లు మాత్రమే. ఇక పూర్తయిన పనులెన్నో తెలుసా? కేవలం 542. ఈ గణాం కాలు చాలు ఎస్‌డీఎఫ్‌ పనులు ఎంత నత్తనడకనసాగుతున్నాయో చెప్పడానికి. నిధులు విడుదలైన వెంటనే పనుల మంజూరులో మాత్రం అత్యుత్సాహం చూపారు. రూ.10 లక్షల చొప్పున నామినేషన్ల పద్ధతిలో పనులను పంచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలనే తేడా లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ 15 శాతం చొప్పున పర్సంటేజీలు దండేసుకున్నారు. కొంతమందయితే 20 శాతం వరకు పిండుకున్నారు.

మిగిలిన పనుల్లో 10 శాతం వరకు ముక్కు పిండి వసూలు చేసే అధికారులు ఈ ఎస్‌డీఎఫ్‌ పనుల్లో మాత్రం తమ పర్సంటేజీలను 5 శాతం నుంచి 8 శాతానికి కుదించుకున్నారు. కారణం ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిల ముఖ్య అనుచరులు 5 శాతం చొప్పున ఈ పనుల్లో వాటాలు పిండేశారు. ఈ విధంగా మంజూరు చేసిన 121.91 కోట్లలో 25 నుంచి 30 శాతం మేర సంతకం పెట్టగానే పర్సంటేజీలు ఎవరికి వారు దం డేశారు. ఈ విధంగా రూ.30 కోట్ల నుంచి రూ.36 కోట్ల వరకు జేబుల్లో వేసుకున్నారు. పర్సంటేజీలు దండేసుకున్నాం కదా ఇక ఆ పనులతో తమకు సంబంధం ఏమిటన్న ధోరణిలో ఎమ్మెల్యేలు ఉదాశీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ కారణంగానే ఈ పనులు నత్తనడకన సాగుతున్నా పట్టించుకునే నాథులు కరువయ్యారు. ప్రత్యేక అభివృద్ధి నిధులు వినియోగంలో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున ఉండడం పరిస్థితికి అద్దం పడుతుంది.

నత్తను తలదన్నేలా పనుల పురోగతి
రాక రాక అధికారం వచ్చింది... దాదాపు ఏడాదిన్నర పోరాటం తో ఎమ్మెల్యేల చేతికి నిధులు వచ్చాయి... ఈ నిధులను స్థానిక సమస్యలకు ఖర్చు చేయడంలో మాత్రం వారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా అరకు నియోజకవర్గానికి 11.60 కోట్లు మంజూరు కాగా ఈ నిధులతో 587 పనులు మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 87.67 లక్షల విలువైన 26 పనులు మాత్రమే పూర్తి చేయగలిగారు. పాడేరు, గాజువాక, విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక్క పని కూడా పూర్తి చేయలేని దుస్థితి నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పాడేరులో 4.67 కోట్లతో 278 పనులు మంజూరు చేశారు. అలాగే గాజువాకలో 4.12 కోట్లతో కేవలం నాలుగు మంజూరు చేశారు. విశాఖ దక్షిణంలో 7.96 కోట్లతో 31 పనులు మంజూరు చేశారు. దక్షిణంలోనే కాదు.. విశాఖ సిటీలో దాదాపు ఏడు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విశాఖ తూర్పులో రూ.9.26 కోట్లతో 41 పనులు మంజూరు చేస్తే కేవలం రూ.17.11 లక్షలతో 11 పనులు పూర్తి చేయగలిగారు. ఇక విశాఖ ఉత్తరంలో 10.44 కోట్లతో 54 పనులు మంజూరు చేస్తే రూ.13.26 లక్షలతో ఒకే ఒక్క పనిని పూర్తి చేయగలిగారు.

ఇక విశాఖ పశ్చిమంలో రూ.8 కోట్లతో 71 పనులు మంజూరు చేస్తే రూ.40.40 లక్షల విలువైన నాలుగు పనులు పూర్తి చేయగలిగారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గానికి రూ.5.03 కోట్లతో 36 పనులు మంజూరు చేస్తే రూ.52.94 లక్షల విలువైన నాలుగు పనులు పూర్తి చేయగలిగారు. రూ.9.22 కోట్లతో 153 పనులు మంజూరు చేసిన పెందుర్తిలో రూ.98.55 లక్షల విలువైన 18 పనులు పూర్తి చేయగలిగారు. మిగిలిన నియోజక వర్గాల్లో కూడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదనే చెప్పాలి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలో నిధుల విడుదలలో నిర్లక్ష్యం ప్రదర్శించడం వలనే పనులు వేగవంతం కావడం లేదంటూ ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. దీంతో పనుల పురోగతిని పట్టించుకోకుండా మార్చి 31 వరకు మంజూరైన నిధులను ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీలకు విడుదల చేసేయండి అంటూ కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇలా నిధులు మంజూరు చేస్తే పనులు జరగకుండానే నిధులు డ్రా చేసే అవకాశాలు లేకపోలేదని సంబంధిత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement