బందరు టీడీపీలో పదవుల లొల్లి | Sakshi
Sakshi News home page

బందరు టీడీపీలో పదవుల లొల్లి

Published Thu, May 22 2014 1:49 AM

బందరు టీడీపీలో పదవుల లొల్లి - Sakshi

  • చైర్మన్, వైస్ పదవుల కోసం పైరవీలు
  •  రేసులో పలువురు
  •  మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ కౌన్సిలర్లలో పదవుల లొల్లీ కొనసాగుతోంది. పట్టణంలో ఉన్న 42 మున్సిపల్ వార్డులకు గానూ  29 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులు అత్యధిక వార్డుల్లో గెలుపొందటంతో ఆ పార్టీ పాలకవర్గమే పాలన కొనసాగించనుంది. దీంతో చైర్మన్, వైస్‌చైర్మన్, కో-ఆప్షన్ సభ్యుల పదవుల కోసం గెలుపొందిన కౌన్సిలర్లలో, పార్టీ విజయానికి కృషి చేసిన ద్వితీయశ్రేణి నాయకుల్లో అంతర్‌యుద్ధం కొనసాగుతోంది.

    ఈ పదవుల కోసం కౌన్సిలర్లు పోటీ పడుతున్నా....చైర్మన్, వైస్‌చైర్మన్ ఎవరనేదానిపై పార్టీ అధినాయకులు నోరు మెదపటం లేదు. నాయకులు ఎవరిపేరునూ ప్రకటించకపోవడంతో ఎన్నికైన కౌన్సిలర్లలో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది.  14వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు మోటమర్రి వెంకట బాబాప్రసాద్‌ను చైర్మన్ చేస్తామని, దీనికి గానూ వైశ్య సామాజిక వర్గం వారు పార్టీకి ఫండ్ ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు అప్పట్లో కోరారు.

    నాయకులు ఇచ్చిన హామీతో వైశ్య పెద్దలు లక్షలాది రూపాయలను పోగేసి నాయకులకు అందజేశారని తెలుస్తుంది. బాబాప్రసాద్ వదిన మోటమర్రి శ్రీదేవి కూడా 35వ వార్డులో కౌన్సిలర్‌గా గెలుపొందింది. ఒకే కుటుంబంలో పోటీచేసిన ఇద్దరూ విజయం సాధించారు. బాబాప్రసాద్‌కు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తారనే నమ్మకంతో పట్టణంలోని వైశ్యులు మునిసిపల్ ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకే ఓట్లేశారని ప్రచారం సాగుతోంది.  
     
    ఎమ్మెల్యేగా ఎన్నికైన కొల్లు రవీంద్రను ఇటీవల ప్రశ్నిస్తే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పంపే సీల్డ్ కవర్‌లో ఉన్న పేర్ల ప్రకారమే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు   ప్రకటిస్తామని చెప్పారు. చైర్మన్ పదవి కోసం కౌన్సిలర్లు  బత్తిన దాసు(1వ వార్డు), పంచపర్వాల కాశీవిశ్వనాధం(5వ వార్డు), కొట్టే అంకావెంకట్రావు(9వ వార్డు), నారగాని ఆంజనేయప్రసాద్(28వ వార్డు), పల్లపాటి వెంకటసుబ్రహ్మణ్యం(38వ వార్డు)  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  

    ఈ గండం నుంచి ఎలా గొలా గట్టెక్కాలనే ఉద్దేశంతోనే  నాయకులు పదవుల ఎంపిక వ్యవహారాన్ని పార్టీ అధినేతకు అప్పగించి సీల్డ్ కవర్‌లో వచ్చిన పేర్ల వారికే ఈ పదవులను కట్టబెట్టి ఎంపికలో తమ ప్రయేయం లేదని అనిపించుకుని చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
     

Advertisement
Advertisement