రాయల తెలంగాణకు ఆమోదం లేదుః శైలజానాథ్ | Sakshi
Sakshi News home page

రాయల తెలంగాణకు ఆమోదం లేదుః శైలజానాథ్

Published Sun, Aug 25 2013 10:54 PM

రాయల తెలంగాణకు ఆమోదం లేదుః శైలజానాథ్

సాక్షి, హైదరాబాద్ : రాయల తెలంగాణకు ప్రజామోదం లేదని సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ డాక్టర్ ఎస్.శైలజానాథ్ చెప్పారు. ఎవరో కొంతమంది నేతలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిస్తున్నారే తప్ప సీమాంధ్రలో 99 శాతం మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటున్నారని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజుతో కలిసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించడం మినహా మరే  ప్రతిపాదనను అంగీకరించేది లేదని, విభజనపై కేంద్ర ప్రభుత్వ కమిటీ ఏర్పడినా...ఆంటోని కమిటీయే కొనసాగినా తమ వైఖరిలో మాత్రం మార్పు ఉండబోదని ఉద్ఘాటించారు.
 
 తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నిజంగా విభజనను వ్యతిరేకిస్తున్నట్లయితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని టీడీపీ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు.  తెలుగు జాతి ఐక్యతకు విఘాతం కలిగే  ప్రమాదం ఏర్పడినందున ఇప్పటికైనా ఓట్లు, సీట్ల రాజకీయాలు మానేసి విపక్ష పార్టీలు విభజనను వ్యతిరేకించాలని సూచించారు. విభజన పాపం కిరణ్, బొత్సలదేనంటూ కిషోర్ చంద్రదేవ్ చేసిన విమర్శలను శైలజానాథ్ తోసిపుచ్చారు.
 

Advertisement
Advertisement