వైఎస్‌ తొమ్మిదో వర్ధంతి నేడు  | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 2 2018 2:20 AM

Service Activities On YS Rajasekhara Reddy Death Anniversary - Sakshi

సాక్షి, అమరావతి/వేంపల్లె : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి నిర్వహించి ఘనంగా నివాళులర్పించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు దేశ, విదేశాల్లోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్‌ అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. 2009 సెప్టెంబర్‌ 2న ‘రచ్చబండ’ కార్యక్రమానికి వెళుతూ ఆయన హెలీకాప్టర్‌ ప్రమాదంలో మరణించిన విషయం విదితమే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అమలు చేసిన ప్రజాసంక్షేమ పథకాల వల్ల ఇప్పటికీ తెలుగు ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలను గుర్తుచేసుకుంటూ అన్ని చోట్లా కార్యక్రమాలు చేయబోతున్నారు. వైఎస్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు వైఎస్‌కు నివాళులర్పించిన తరువాత సేవా కార్యక్రమాలు జరుగుతాయి. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో కూడా వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నారు.

 ఇడుపులపాయలో ఏర్పాట్లు పూర్తి 
ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే వైఎస్సార్‌ సతీమణి వైఎస్‌ విజయమ్మ, కుమార్తె షర్మిలమ్మ, వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతీరెడ్డిలతో పాటు ఇతర కుటుంబసభ్యులు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు గెస్ట్‌హౌస్‌ నుంచి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుని వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించనున్నారు. 

Advertisement
Advertisement