దారులు చూపండి.. నిధులు నేను తెస్తా! | Sakshi
Sakshi News home page

దారులు చూపండి.. నిధులు నేను తెస్తా!

Published Sat, May 24 2014 12:13 AM

దారులు చూపండి..  నిధులు నేను తెస్తా! - Sakshi

ఉన్నతాధికారులతో బాబు
విభజన వల్ల నష్టాలను పూడ్చే మార్గాలను అన్వేషించండి
కేంద్రం నుంచి ఎక్కువ నిధులు పొందే అవకాశాలు చెప్పండి
సీఎస్, ఉన్నతాధికారులను కోరిన కాబోయే సీఎం

 
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిధులు సమకూర్చుకునే మార్గాలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులకు టీడీపీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు అజయ్ కల్లం, పి.వి.రమేష్ , కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి, అదనపు కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు శుక్రవారం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు తదితర అంశాలపై రమేష్, రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో వివరించారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను వివరించారు. విభజన తర్వాత రాష్ట్ర ఆదాయ పద్దు ఎలా ఉంటుందనే అంచనాలను వివరించారు. ‘రాష్ట్ర విభజన జరిగింది. ఇక దీనిపై మాట్లాడేదేముంది? విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఆ నష్టాలను పూడ్చే మార్గాలు అన్వేషించండి. ఎక్కడెక్కడ ఎలాంటి నష్టం జరిగింది.. దీనికి ప్రత్యామ్నాయాలేమిటో మీరు ఆలోచించండి.’ అని చంద్రబాబు వారికి సూచించినట్లు తెలిసింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని, వాటి అమలుకు నిధులు సమకూరే మార్గాలను అన్వేషించాలని వారిని కోరినట్లు సమాచారం.

కొత్త రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి వల్ల కలిగే ప్రయోజనాలు, దీని ద్వారా నిధులు పొందే మార్గాలను పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ఉన్న మార్గాలను పరిశీలించి నివేదిక ఇవ్వండి. మీరు మార్గాలు చూస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా...’ అని చంద్రబాబు పేర్కొన్నట్లు తెలిసింది. ఉద్యోగుల విభజన విషయంలో ఎవరికీ అన్యాయం జరుగకుండా చూడాలని.. వీలైనంత త్వరగా కొత్త రాజధానికి వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా బాబు పేర్కొన్నట్లు చెప్తున్నారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా కేంద్రాన్ని ఇప్పుడే కొత్త చోటుకు తీసుకెళ్లడం వీలుకాదని, రాజధానికి అవసమైన వసతులు సమకూర్చడానికి కనీసం రెండేళ్లు పడుతుందని, అప్పటి వరకూ హైదరాబాద్ నుంచే పాలన కొనసాగించడం ఉత్తమమనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 

Advertisement
Advertisement