వెన్నెల బుచ్చింపేటలో మరణమృదంగం.. | Sakshi
Sakshi News home page

వెన్నెల బుచ్చింపేటలో మరణమృదంగం..

Published Tue, Mar 13 2018 1:28 PM

Six Died In One Month Vennela buchipeta Village - Sakshi

విజయనగరం, సీతానగరం: మండలంలోని అంటిపేట పంచాయతీ వెన్నెల బుచ్చింపేట వాసులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒకే నెలలో ఆరుగురు మృత్యువాడ పడగా, మరో ఇద్దరు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత నీరు, అధ్వాన పారిశుద్ధ్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో మడక కృష్ణమ్మ, గొట్టాపు సత్యం, అర్తాపు గుంపస్వామి, మూడడ్ల అప్పలస్వామి, వెన్నెల పెదసూర్యనారాయణతో పాటు పది నెలల చిన్నారి గొడబ కీర్తన కన్నుమూశారు. అలాగే బి. విజయమ్మ బొబ్బిలిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో.. టి. మహాలక్ష్మి విశాఖలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు ఆరుగురు మృతి చెందినా కనీసం అధికారులు గ్రామంవైపు కన్నెత్తి చూడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కలుషితం కావడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మూలకు చేరిన రక్షిత మంచినీటి పథకం
గ్రామంలో రక్షత మంచినీటి పథకంతో పాటు నాలుగు బోరుబావులు, మూడు నేలబావులున్నాయి. ఐదేళ్ల కిందట నిర్మించిన రక్షిత మంచినీటి పథకం అప్పుడే మూలకు చేరింది. ప్రస్తుతం పాఠశాల ఆవరణలో ఉన్న బోరు నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు.   బోరుబావి పరిసరాలు అధ్వానంగా ఉండడం... గ్రామంలో ఎక్కడ చూసినా మురుగునీరు, చెత్తా,చెదారాలు పేరుకుపోవడంతో తాగునీరు కలుషితం అయిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కాలువలు లేకపోవడంతో మురుగునీరు ఎక్కడబడితే అక్కడే నిల్వ ఉంటోందని స్థానికులు వాపోతున్నారు.

కానరాని అధికారులు
సభలు, సమావేశాల్లో కనబడే అధికారులు గ్రామంలో ఆరుగురు మృత్యువాత పడినా కనబడకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. మా కష్టాలు వారికి పట్టవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

పెద్ద దిక్కును కోల్పోయాం.
గ్రామానికి చెందిన ఇద్దరు పెద్దలను కోల్పోయాం. ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయో అర్థం కావడం లేదు. అధికారులు రారు.. మరణాలు ఆగవు.. మా పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు. 
– జి. రవి, ఇంజినీరింగ్‌ విద్యార్థి

Advertisement
Advertisement