Sakshi News home page

‘స్మార్ట్’పై చిగురించిన ఆశలు

Published Thu, Oct 2 2014 1:24 AM

'Smart' blossoming hopes

  • నగరాభివద్ధికి అమెరికా సహకారం
  • మోదీ అమెరికా పర్యటనలో ప్రస్తావన
  • సమకూరనున్న ఆధునిక వసతులు
  • 20 ఏళ్లలో మారనున్న రూపురేఖలు
  • సాక్షి, విశాఖపట్నం : విశాఖ అత్యాధునిక స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందడానికి మార్గం సుగమమైంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో చర్చల సందర్భంగా స్మార్ట్ సిటీలుగా అభివద్ధిపరచడానికి అలహాబాద్, అజ్మీర్‌లతోపాటు విశాఖ నగరాన్నీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒబామా  సానుకూలంగా స్పందించడంతో ఆశలు చిగురించాయి. అంతా సవ్యమైతే రాగల రెండు దశాబ్దాల కాలంలో నగరం రూపురేఖలు సమూలంగా మారనున్నాయి.
     
    స్మార్ట్ అంటే..

    పాశ్చాత్య దేశాల్లో చిన్న నగరాలు అనతికాలంలోనే అభివద్ధి పథంలో పరుగులు తీసేలా చేసిన అభివద్ధి మంత్రమే స్మార్ట్  ప్రణాళిక. వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో పెరుగుతున్న వలసలకు దీటుగా ప్రగతి ప్రణాలిక రూపొందిస్తారు. అత్యున్నత స్థాయి సమాచార, సాంకేతికత వినియోగంతో ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పిస్తారు.  పర్యావరణానికి అగ్రాసనమేస్తారు. తక్కువ సమయంలో ప్రయాస లేకుండా చేరుకునేలా ప్రజారవాణా వ్యవస్థను తీర్చిదిద్దుతారు.

    ఇప్పటికే మెట్రో రైలు వ్యవస్థకు జీవీఎంసీలో ప్రతిపాదనలున్నాయి.  దీంతోపాటు బీఆర్‌టీఎస్, ఎల్‌ఆర్‌టీ, మోనోరైల్ తదితర రవాణా వ్యవస్థలు, ఇతర వాహనాల గమనానికి వీలుగా మౌలిక వనరుల అభివద్ధిలో రింగ్ రోడ్డు, బైపాస్, ఎలివేటెడ్ రోడ్లు, ప్రస్తుతమున్న రోడ్లతోపాటు, వాకింగ్, సైక్లింగ్, జలమార్గాల అభివద్ధి జరగనుంది. సెకనుకు 100 మెగాబైట్స్(ఎంబీపీఎస్) వేగంతో ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్, వైఫై విస్తతి అందిస్తారు.
     
    నీరు, డ్రై నేజీ, ఘన వ్యర్థ నిర్వహణలో అత్యధిక నాణ్యత గలిగిన సేవలు సమకూరుతాయి.  రోజంతా విద్యుత్, నీటి సరఫరా ఉంటుంది. ఒక్కో వ్యక్తికి రోజుకు కనీసం 135 లీటర్ల నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. తాగునీరు, రీ సైక్లింగ్ వాటర్ వేర్వేరుగా అందించే ఏర్పాట్లు చేస్తారు. అన్ని ఇళ్లకూ ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీ, అన్ని పబ్లిక్ ప్లేస్‌లు, విద్యా సంస్థల్లో వైఫై అందుబాటులో ఉంటుంది.
     
    ఇండస్ట్రియల్ పార్కులు, ఎక్స్‌పోర్టు ప్రాసెసింగ్ జోన్లు, ఐటీ/బీటీ పార్కులు, ట్రేడ్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లు ,స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు,ఫైనాన్షియల్ సెంటర్స్ అండ్ సర్వీసెస్, లాజిస్టిక్స్ హబ్స్, వేర్ హౌసింగ్ అండ్ నౌకా రవాణా టెర్మినల్స్ , మోనెటరింగ్ అండ్ కౌన్సెలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తారు.
     
    కేంద్రం సహకారమిదీ

    దేశంలో 100 నగరాల్ని స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు హై పవర్ ఎక్స్‌పర్ట్ కమిటీ(హెచ్‌పీఈసీ)ని ఏర్పాటు చేసి 20 ఏళ్ల కాలంలో రూ.43,386 తలసరి పెట్టుబడి వ్యయ(పీసీఐసీ) అంచనాలు ప్రతిపాదించారు. 20 ఏళ్లలో ఏడాదికి రూ.35 వేల కోట్లు చొప్పున సుమారు రూ.7 లక్షల కోట్లు కేటాయించనున్నారు. ఒక్కో నగరానికి సగటున ఏడాదికి రూ.350 కోట్లు మేర అభివద్ధి పనులు జరగొచ్చు.  దీన్ని పూర్తిగా ప్రయివేటు లేదా ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం(పీపీపీ)లో సేకరించనున్నారు.
     

Advertisement

What’s your opinion

Advertisement