స్మార్ట్ సిటీలకు దీటుగా ఏలూరు | Sakshi
Sakshi News home page

స్మార్ట్ సిటీలకు దీటుగా ఏలూరు

Published Fri, Sep 26 2014 1:40 AM

Smart City to counter Eluru

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :  స్మార్ట్ట్ సిటీల జాబితాలో ఏలూరు నగరానికి చోటు దక్కలేదని ఏ మాత్రం బాధపడనక్కర లేదని.. వాటికి దీటుగా ఏలూరును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ కె.భాస్కర్ వెల్లడించారు. నగరీకరణ దిశగా జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ‘సాక్షి’ ఇంట ర్వ్యూలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పురోభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
 
 డేటా ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించాం
 అధికారిక పర్యటనల్లో భాగంగా తాను ప్రపంచంలోనే పేరొందిన కొరియాలోని స్మార్ట్ట్ సిటీ ఇంచివాన్‌ను పలుమార్లు సందర్శించానని కలెక్టర్ పేర్కొన్నారు. స్మార్ట్ట్ సిటీ ఎలా ఉంటుందన్న విషయమై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఇంచివాన్‌తోపాటు పలు స్మార్ట్ట్ సిటీలను చూసిన అనుభవంతో ఏలూరులో గల సహజ, శక్తి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని స్మార్ట్ట్ సిటీలకు దీటుగా రూపురేఖలు మారుస్తామని వివరించారు. ఇప్పటికే నగర సమగ్రాభివృద్ధికి సంబంధించి డేటా ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించామని కలెక్టర్  చెప్పారు.
 
 తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ, రహదారులు వంటి ప్రాథమిక వసతులను మెరుగుపర్చడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించామన్నారు. ఏలూరు నగరంతోపాటు నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, కొవ్వూరు, నిడదవోలు, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం పట్టణాలను నగరాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయూ మునిసిపాలిటీలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.1,500 కోట్లు అవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నివేదిక పంపామని చెప్పారు. రెండు రోజుల్లో జిల్లాకు వస్తున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడును కలిసి నిధుల విడుదల కోసం విజ్ఞప్తి చేస్తామన్నారు. తొలిదశలో కనీసం రూ.వంద కోట్లు విడుదలైనా చాలని, వెంటనే పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ చెప్పారు.
 
 విలీన మండలాల ఉద్యోగులకు ఇక్కడినుంచే జీతాలు
 ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు, ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఈనెల నుంచి మన జిల్లా ఖజానా నుంచే జీతాలు అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ఇప్పటివరకు అక్కడ ఎంత అభివృద్ధి జరిగిందనేది పక్కనపెడితే మన జిల్లాలో కలిసిన తర్వాత ఆ ప్రాంతాల రూపురేఖల్ని పూర్తిస్థాయిలో మారుస్తామని స్పష్టం చేశారు. ముందుగా కనీస ప్రాథమిక వసతుల కల్పనపై దృష్టి సారించామన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యే ఈ విలీన గ్రామాల్లోని ప్రజలందరికీ వేగంగా పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదట్లో ఒకింత భావోద్వేగాలతో చిన్నపాటి సమస్యలు వచ్చినా ఇప్పడు విలీన ప్రాంతాల ప్రజలు మనతో మమేకమవుతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
 
 పోలవరం పనుల్లో జాప్యం నిజమే కానీ..
 పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. ప్రతి శని వారం ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఆ వారంలో ఎంతవరకు పనులు జరిగాయనేది సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకు పనుల్లో జాప్యం చోటుచేసుకున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. కాంట్రాక్టర్‌తో ప్రభుత్వం చర్చలు జరిపిన నేపథ్యంలో వారం రోజులుగా పనులు ఊపందుకున్నాయని, ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి ప్రాజెక్ట్ పూర్తవుతుందన్న నమ్మకంతో ఉన్నామని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ సమస్యపూర్తిగా పరిష్కారం కాలేదని, త్వరలోనే దీనిపై కూడా స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement