త్వరలో అందరికీ ఈఎస్‌ఐ సేవలు | Sakshi
Sakshi News home page

త్వరలో అందరికీ ఈఎస్‌ఐ సేవలు

Published Mon, Oct 13 2014 1:03 AM

త్వరలో అందరికీ ఈఎస్‌ఐ సేవలు

కేంద్రం ఆదేశాలు.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అమలు పరిధిలో లేనివారికి యూజర్  చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం
 
హైదరాబాద్: కార్మిక రాజ్యబీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) పరిధిలోని ఆస్పత్రులు ఇక అందరివీ కానున్నాయి. త్వరలోనే ఈఎస్‌ఐ పరిధిలో లేనివారు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందవచ్చు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటి వరకూ ప్రైవేటు సంస్థల్లో రూ. 15 వేల లోపు వేతనం ఉన్న ఉద్యోగులు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. ఆ ఉద్యోగి కుటుంబంలోని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి, తండ్రి ఈ సేవల పరిధిలో ఉన్నారు. ఇకపై సాధారణ ప్రజలు అంటే ఎలాంటి సంస్థల్లో పనిచేయకపోయినా ఈఎస్‌ఐ ఆస్పత్రులకెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. రెండు రాష్ట్రాల పరిధిలోని అన్ని ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు సాధారణ జనానికి అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చాలా ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో కూడా సాధారణ ప్రజలకు వైద్యసేవలు పొందే అవకాశం కల్పిస్తే ఎంతో కొంత మేలు చేసే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ అభిప్రాయం. అయితే ఈఎస్‌ఐ పరిధిలో లేని వారి నుంచి సేవను బట్టి యూజర్ చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 కేన్సర్, కిడ్నీ రోగుల నరకయాతన

ఓవైపు సాధారణ రోగులకూ ఈఎస్‌ఐ సేవలు అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంటే, మరోవైపు రాష్ట్రంలో కేన్సర్, కిడ్నీ రోగులకు మందులే అందడం లేదు. దీంతో ఆ వ్యాధుల బాధితులు నరకం అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితికి ఈఎస్‌ఐ కార్పొరేషన్, డెరైక్టరేట్‌ల మధ్య సమన్వయ లోపమే కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఈఎస్‌ఐ కార్పొరేషన్ కేంద్రం పరిధిలోనూ, డెరైక్టరేట్ రాష్ట్ర పరిధిలోనూ ఉంటుంది. నిబంధనల ప్రకారం కిడ్నీ, కేన్సర్ రోగులు కార్పొరేషన్ పరిధిలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి (సనత్‌నగర్)లో చికిత్స పొందుతారు. అక్కడ ఇన్‌పేషెంటుగా ఉన్నంత కాలం ఆస్పత్రిలోనే మందులు ఉచితం గా ఇస్తారు. డిశ్చార్జి తర్వాత వారికి డెరైక్టరేట్ పరిధిలోని డిస్పెన్సరీల్లో ప్రతినెలా అవసరమైనన్ని మందులివ్వాలి. కానీ తాము మందులు ఇవ్వలేమని డెరైక్టరేట్ అధికారులు తేల్చిచెబుతున్నారు. ఒక్కో త్రైమాసికానికి మందులకు రూ.3 కోట్లు అవుతోందని, అందువల్ల స్పెషాలిటీ ఆస్పత్రిలోనే మందులు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. డిశ్చార్జి అయ్యాక మందు లు తామిచ్చేదిలేదని స్పెషాలిటీ ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. దీంతో గత రెండు మాసాలుగా కిడ్నీ, కేన్సర్ రోగులు మందులు అందక తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. దీనిపై డెరైక్టరేట్ అధికారులను వివరణ కోరగా దీనిపై ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు లేఖ రాయనున్నట్టు తెలిపారు.
 

Advertisement
Advertisement