ఆడిట్ కోసం ఆపసోపాలు | Sakshi
Sakshi News home page

ఆడిట్ కోసం ఆపసోపాలు

Published Wed, Feb 24 2016 12:12 AM

Step back for the audit of the municipalities

మార్చి 15వ తేదీలోగా చేయించుకోవాలి
  మున్సిపాలిటీలకు మున్సిపల్ డైరక్టర్ ఆదేశాలు
  ఆడిట్ జరగకపోతే వచ్చే ఏడాది ఖర్చులకు ఆటంకం
 
 విజయనగరం కంటోన్మెంట్: ఆడిట్ కోసం వెనకడుగు వేసిన మున్సిపాలిటీలు ఈ ఏడాది ఆడిట్ చేయించకపోతే వచ్చే ఏడాది నిధులు రావని మున్సిపల్ డైరక్టర్ హెచ్చరించడంతో ఉరుకులు పరుగులు తీస్తున్నాయి. తమ లెక్కలను ఆడిట్ చేయమని ఆడిట్ శాఖను అడుగుతున్నాయి. దీంతో ఆడిట్‌కు సిద్ధం చేయాల్సిన ఫైళ్ల వివరాలను తెలియజేస్తూ జిల్లా ఆడిటర్ మున్సిపాలిటీలకు అవగాహన కల్పిస్తున్నారు.
 
 ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జనవరి నెల నుంచి ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఎలాగైనా వచ్చే నెల 15 నాటికి లెక్కలు తేల్చేందుకు అటు ఆడిట్, ఇటు మున్సిపల్ అధికారులు ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పాటు 2014-15 ఆర్థిక సంవత్సరం లెక్కల ఆడిట్‌ను పూర్తి చేసేందుకు మున్సిపాలిటీల యంత్రాంగాలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆడిట్ పనులు ఊపందుకుంటున్నాయి.
 
 ఉరుకులు పరుగులు
 జిల్లాలో పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, విజయనగరం మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ లెక్కలు కూడా వెంటనే ఆడిట్ చేసేందుకు సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు. పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలకు గతేడాది కూడా ఆడిట్ జరుగలేదు. జీవీఎంసీ ఆడిట్ కోసం అక్కడి అధికారులను పంపడంతో ఈ రెండు మున్సిపాలిటీలకు ఆడిట్ జరగలేదు. మరో పక్క ఈ ఏడాది ఆడిట్ కూడా పెండింగ్ ఉంది. దీంతో ప్రస్తుతం కేవలం నెల రోజుల్లోగా ఆడిట్ పూర్తి చేయాల్సి ఉంది. ఇంత తక్కువ కాలంలో జరుగుతుందా? అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మున్సిపాలిటీలకు వచ్చే అభివృద్ధి పనులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు, వివిధ ప్రొడక్షన్ గ్రాంట్లు ఇలా అన్ని రకాల ఆదాయ వ్యయాలపై వార్షిక ఆడిట్ నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఎక్కువ ఆదాయం, ఖర్చు జరిగేది జిల్లా కేంద్రంలోనే.
 
  విజయనగరం మున్సిపాలిటీలో ఏటా రూ.21 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. నీటిపన్ను, ఇంటి పన్ను, బీపీఎస్, వివిధ అభివృద్ధి పనుల కింద ఈ నిధులు సమకూరుతున్నాయి. ఈ నిధుల్లో రూ.15 కోట్ల సగటు ఖర్చు అవుతోంది. వీటికి సంబంధించి రెండేళ్ల ఆడిట్ జరగాల్సి ఉంది. బొబ్బిలి మున్సిపాలిటీకి సంబంధించి రూ.5 కోట్ల వార్షికాదాయం వివిధ మార్గాల ద్వారా వస్తుండగా రూ. 3.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల ఖర్చవుతోంది.
 
  సాలూరు మున్సిపాలిటీలో రూ.8.1 కోట్ల బడ్జెట్ ఉండగా ఏటా రూ.2 కోట్ల ఆదాయం వస్తోంది. ఖర్చు మాత్రం రూ.4 కోట్ల పైచిలుకు అవుతోంది. పార్వతీపురంలో ఏటా రూ.మూడున్నర కోట్ల ఆదాయం వస్తుండగా రూ.1.8 కోట్ల ఖర్చవుతోంది. నెల్లిమర్ల నగర పంచాయతీకి ఏటా రూ.53.51 లక్షల ఆదాయం సమకూరుతుండగా రూ.కోటి పైనే ఖర్చవుతోంది. మొత్తం రూ.34.01 కోట్ల ఆదాయానికి ఆడిట్‌లు జరుగుతున్నాయి. ఇవి కాకుండా గతేడాది విజయనగరం, సాలూరు మున్సిపాలిటీల ఆడిట్ కూడా నిర్వహిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement