అన్నదాతపై వాతావ‘రణం’ | Sakshi
Sakshi News home page

అన్నదాతపై వాతావ‘రణం’

Published Thu, Nov 6 2014 12:44 AM

అన్నదాతపై వాతావ‘రణం’

 అమలాపురం :అందరికీ అన్నంపెట్టే అన్నదాత పరిస్థితి నిచ్చెనలు లేని వైకుంఠపాళి ఆడుతున్నట్టు మారింది. ఎప్పుడు, ఎక్కడ, ఏ పాము కరుస్తుందోననే భయంతోనే ఈ క్రీడ ఆడాల్సి వస్తోంది. నకిలీ విత్తనాలు, వర్షాభావం, తెగుళ్లు, దిగుబడి క్షీణత వంటివన్నీ దాటుకుని కోతలకు సిద్ధమవుతున్న సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, తుపానుగా రూపాంతరం చెందుతుందనే హెచ్చరిక రైతుల గుండెల్లో తుపాను వేళ కడలి హోరు లాంటి కలవరాన్ని పుట్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనద్రోణి వాయుగుండంగా, తుపానుగాను మారి ఒకటి, రెండు రోజుల్లో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. గత నెల హుదూద్ కొట్టిన నుంచి రైతులు ఇంకా తేరుకోలేదు. జిల్లాలో తుని, ప్రత్తిపాడు వంటి ప్రాంతాల్లో హుదూద్ ప్రభావం బాగా కనిపించింది. అప్పుడు రెండురోజుల పాటు కురిసిన భారీ వర్షాలు పూతదశలో ఉన్న చేలను నష్టపరిచాయి. చేలు నీట మునగడం కూడా దిగుబడి, నాణ్యతలపై ప్రభావం చూపాయి.
 
 ఈ నేపథ్యంలో తుపాను హెచ్చరిక రైతులను కలవరానికి గురి చేస్తోంది. జిల్లాలో 5.30లక్షల ఎకరాల్లో వరిసాగు జరగగా, తూర్పు, మధ్యడెల్టాల్లో కోతలు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. మెట్ట, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)ల్లో ఈ నెలాఖరుకు కోతలు ముమ్మరమయ్యే అవకాశముంది. సాగు ఆలస్యంగా జరిగిన డెల్టాలోని సముద్రతీర మండలాల్లో డిసెంబరు 15 తరువాత కాని కోతలు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈ సమయంలో తుపాను వల్ల భారీ వర్షాలు కురిస్తే చేతికి వచ్చిన పంటను కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఆరేళ్లలో 2011లో మినహా ప్రతి ఖరీఫ్‌లో రైతులు వర్షాలు, తుపాన్లు వల్ల   సగం పంటను కోల్పోవడం ఆనవాయితీగా మారింది. అక్టోబరు 15 నుంచి నవంబరు 25 మధ్యలో తుపాన్లు, ఈశాన్య రుతుపవనాల వల్ల కురిసే భారీ వర్షాలు రైతులను నిలువునా ముంచుతున్నాయి.  
 
 పెట్టుబడి దక్కినా అదే పదివేలు..
 తూర్పు, మధ్యడెల్టాల్లో ఖరీఫ్ వరి సాగు ఆది నుంచీ అవరోధాల నడుమే సాగుతోంది. వర్షాభావం వల్ల సాగు ఆలస్యం కావడంతోపాటు సకాలంలో నీరందక పంటలు ఎండిపోయే దుస్థితి ఎదురైంది. మెట్ట ప్రాంతంలో చెరువులు నిండక రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాల్సి వచ్చింది. సాగు చేసిన చోట సరైన వర్షాలు లేక తెగుళ్లు విజృంభించాయి. చివరిలో మెట్ట, డెల్టా అనే తేడా లేకుండా సుడిదోమ రైతుల ఆశలకు పిడుగుపాటుగా పరిణమించింది. డెల్టాలో శివారు భూముల్లో సగటు దిగుబడి ఎకరాకు 22 బస్తాలకు మించి వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో కనీసం పెట్టుబడులైనా వస్తే చాలని రైతులు ఆశించే దుస్థితి నెలకొంది. ఈ సమయంలో మళ్లీ తుపాను విరుచుకు పడితే అసలుకే ఎసరు తప్పదని కలవరపడుతున్నారు.
 

Advertisement
Advertisement