తప్పుడు ప్రకటనతో మోసపోయిన విద్యార్థి | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రకటనతో మోసపోయిన విద్యార్థి

Published Sat, Sep 20 2014 1:57 AM

Students forestalled a false statement,

రాయదుర్గంటౌన్: ‘టీవీలో వచ్చిన ప్రకటనలో మా ప్రశ్నకు నీవు సరైన సమాధానం చెప్పావు. లక్కీ కంటెస్ట్‌లో టాటా సఫారీ కారు గెలుచుకున్నావు. నీకు కారు కావాలా? లేదా నగదు రూ.12.50 లక్షలు కావాలా?’ అని వచ్చిన ఫోన్‌కాల్‌కు స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థి ఒకరు రూ.15,500 చెల్లించి మోసపోయాడు. తీరా తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు మోసపూరిత ప్రకటన ప్రసారం చేసిన టీవీ ఛానల్, గ్లోబల్  ఇండియన్ లక్కీ కంటెస్ట్ గౌహతి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడైన గుమ్మఘట్ట మండలం గోనబావికి చెందిన శర్మస్‌బేగ్ కుమారుడు ఇర్ఫాన్‌బేగ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 13న మధ్యాహ్నం 1.20 గంటలకు ఓ హిందీ ఛానల్‌లో ప్రసారమైన  ప్రకటనలో  గ్లోబల్ ఇండియన్ లక్కీ కంటెస్ట్ గౌహతి వారు నిర్వహిస్తున్న పోటీలో గెలుపొందిన వారికి బహుమతిగా ఇవ్వనున్న కార్లు ఇవేనని టాటా కార్లను కూడా చూపించారు. తాము చూపించిన చిత్రంలో ఉన్న వ్యక్తిని గుర్తించిన వారికి టాటా సఫారీ కారు ఇస్తామని ప్రకటించారు. దీంతో చిత్రంలో ఉన్న వ్యక్తిని క్రికెటర్ ధోనీగా గుర్తించిన ఇర్ఫాన్‌బేగ్... వెంటనే కంటెస్ట్ నిర్వాహకులకు ఫోన్ చేసి సమాధానం చెప్పాడు. అనంతరం లక్కీ కంటెస్ట్ నిర్వాహకులమంటూ మహేంద్రసింగ్, రాఘవేంద్ర అనే వ్యక్తులు ఇర్ఫాన్‌బేగ్‌కు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పిన నీవు టాటా సఫారీ కారు గెలుచుకున్నావు. నీకు కారు కావాలా, లేక డబ్బు కావాలా అని ప్రశ్నించగా కారు కావాలని సమాధానమిచ్చాడు. దీంతో ట్రాన్స్‌పోర్టు చార్జీల కింద రూ.12,500 తమ అకౌంట్‌లో చెల్లించాలని స్టేట్‌బ్యాంక్ ఖాతా నంబర్ ఇచ్చారు. వెంటనే అదేరోజు ఇర్ఫాన్‌బేగ్ ఆ మొత్తాన్ని వారు సూచించిన అకౌంట్‌కు జమచేశాడు. మరోసారి ఫోన్ చేసి కారు గురించి ఆరా తీయగా  బీమా కోసం మరో రూ.3 వేలు చెల్లించాలని చెప్పారు.
 దీంతో 18వ తేదీన రూ.1,000 అదే ఖాతాకు జమ చేశాడు. శుక్రవారం నిర్వాహకులే ఫోన్ చేసి తక్కువ మొత్తం అకౌంట్‌లో వేశావేమిటని ప్రశ్నించగా మరో రూ.2 వేలను వెంటనే బ్యాంక్‌లో జమ చేశాడు. అనంతరం ఇర్ఫాన్ వారికి ఫోన్ చేసి తనకు కారు వద్దని, బహుమతి మొత్తం చెల్లించాలని కోరాడు. దీంతో వారు మరో రూ.7 వేలు చెల్లిస్తే బహుమతి మొత్తం పంపుతామని సమాధానమిచ్చి ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. ఫలితంగా తాను మోసపోయానని గ్రహించిన ఇర్ఫాన్‌బేగ్ స్థానిక ఎస్‌ఐ రాఘవరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనలాగా ఇతరులు మోసపోకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు.


 

Advertisement
Advertisement