Sakshi News home page

ఉద్యమంలా స్వచ్ఛ భారత్: వెంకయ్య

Published Mon, Oct 6 2014 12:41 AM

ఉద్యమంలా స్వచ్ఛ భారత్: వెంకయ్య - Sakshi

సాక్షి, నెల్లూరు: స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. జాతి నేతల విగ్రహాలను శుభ్రం చేసి, వీధులు ఊడ్చారు. అనంతరం నిర్వహించిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ ఒక రోజు కార్యక్రమం కాదని, నిరంతరం జరగాల్సినదని చెప్పారు.  స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. 2019లో జరుపుకొనే గాంధీ 150వ జయంతి నాటికి స్వచ్ఛ భారత్‌గా తీర్చిదిద్దడమే తమ ఆశయమన్నారు. ప్రతి ఒక్కరూ వారానికి రెండు గంటలు, ఏడాదికి వంద గంటలు పరిశుభ్రత కోసం శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు.

ఆదర్శప్రాయుడు ప్రకాశం పంతులు
తిరుపతి: టంగుటూరి ప్రకాశం పంతులు నేటి యువతకు ఆదర్శప్రాయుడని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు, మోదీలాంటి ధీరోదాత్తులైన నాయకులు దేశానికి అవసరమని తెలిపారు. ప్రకాశం పంతులు జీవితంపై రాష్ట్ర శాసన సభ మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్‌రెడ్డి రాసిన ‘ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం’ పుస్తకాన్ని ఆదివారం తిరుపతి ఎస్వీయూ సెనేట్ హాల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకులను ఎదిరించి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రకాశం వంటి మహనీయుల చరిత్రను విద్యార్థులు చదవాలన్నారు.

సిద్ధాంతాలకు కట్టుబడి నీతి, నిజాయితీతో రాజకీయాలు నడిపిన ప్రకాశం పంతులు చిరస్మరణీయుడని కొనియాడారు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ప్రముఖ రచయిత తుర్లపాటి కుటుంబరావు పంతులు వ్యక్తిత్వాన్ని వివరించారు. బారిస్టర్‌గా సంపాదించిన ఆస్తులను ప్రకాశం  స్వాతంత్య్రోద్యమ ప్రచారానికి ఖర్చుచేశారని చెప్పారు. ఎస్వీయూ వీసీ రాజేంద్ర మాట్లాడుతూ తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీని ఏర్పాటుచేసి రాయలసీమలో విద్యావ్యాప్తికి ప్రకాశం బాటలు వేశారని తెలిపారు. అనంతరం వెంకయ్యనాయుడిని పలువురు ఘనంగా సన్మానించారు.

Advertisement

What’s your opinion

Advertisement