స్వైన్‌ఫ్లూ కేసులు రెఫర్‌ చేయొద్దు 

27 Nov, 2018 10:59 IST|Sakshi
డాక్టర్‌ రామస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డాక్టర్‌ జగన్నాథ్‌  

సాక్షి, అనంతపురం న్యూసిటీ: స్వైన్‌ప్లూ కేసులన్నీ కర్నూలుకు రెఫర్‌ చేయవద్దని సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ పల్మనాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ రామస్వామిని ఆదేశించారు. సోమవారం ‘సాక్షి’లో మందుల్లేవ్‌..మాస్కుల్లేవ్‌ అన్న కథనానికి ఆయన స్పందించారు. ఉదయం పల్మనాలజీ, మెడిసిన్, పీడియాట్రిక్‌ విభాగం వైద్యులతో సమావేశమయ్యారు. కేసులు ఎందుకు రెఫర్‌ చేయాల్సి వస్తోందని హెచ్‌ఓడీ రామస్వామిని ప్రశ్నించారు. వారి ఇష్టపూర్వకంగానే వెళ్తున్నారని హెచ్‌ఓడీ సమాధానమిచ్చారు.  అందరూ ఆ విధంగా కర్నూలుకు ఎందుకు వెళ్తామంటారని సూపరింటెండెంట్‌ ప్రశ్నించారు. మార్గమధ్యంలో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉండి, ఏవిధంగా ఇతర ప్రాంతాలకు పంపుతారన్నారు. ఇది సరైన పద్ధతికాదని, ఉన్నతాధికారులకు తామేమి సమధానం చెప్పాలన్నారు. 

సూపరింటెండెంట్‌ నేనా.. పల్మనాలజీ హెచోడీనా? 
స్వైన్‌ప్లూ లక్షణాలు కన్పిస్తే, ఎలాంటి ఆలోచన చేయకుండా స్వైన్‌ఫ్లూ వార్డులో ఉంచాలన్నారు. చిన్నపిల్లల విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ మల్లీశ్వరి పాజిటివ్‌ అయితేనే పంపమన్నారని చెప్పారు. సూపరింటెండెంట్‌ ‘నేనా.. డాక్టర్‌ రామస్వామినా’ అని డాక్టర్‌ మల్లీశ్వరిని ప్రశ్నించారు. తక్షణం కేసులను స్వైన్‌ప్లూ వార్డుకు మార్చాలని ఆదేశించారు. స్వైన్‌ప్లూ వార్డులో ఉండే కేసులు ఇతర విభాగాల వైద్యులు చూడాలంటే ఎలాగని డాక్టర్‌ రామస్వామిని సూపరింటెండెంట్‌ ప్రశ్నించారు. స్వైన్‌ప్లూ లక్షణాలు కాకుండా వేరే సమస్యలుంటే ఫాలోఅప్‌ చేస్తారని, రోజూ వారు రావాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. సమన్వయంతో పని చేసి రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ విజయమ్మ, మెడిసిన్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు, ఆస్పత్రి మేనేజర్‌ శ్వేత,  తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు