స్వైన్‌ ఫ్లూ..సైరన్‌...! | Sakshi
Sakshi News home page

స్వైన్‌ ఫ్లూ..సైరన్‌...!

Published Fri, Sep 29 2017 11:27 AM

Swine flu deaths in ysr district

గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా వ్యాప్తంగా ‘స్వైన్‌ ఫ్లూ’ వ్యాధి వీర విహారం చేస్తోంది.ఇప్పుడు ఈ పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు.ఎంతలా అంటే బుధవారం ఎర్రగుంట్ల పరిధిలోని చిలంకూరులో చిరు వ్యాపారం చేసుకొనే ప్రదీప్‌కుమార్‌ (45) ఈ వ్యాధి కారణంగా చనిపోయాడు. గ్రామస్తులు భయపడి  మృత దేహన్ని గ్రామంలోకి రానీయలేదు. ఈ నేపథ్యంలో అధికారులు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. రెండు నెలల క్రితం ప్రొద్దుటూరులోని విజయనగరం వీధికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి బెంగళూరులో చికిత్స పొందుతూ మరణించాడు.జనవరిలో ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడు గ్రామానికి చెందిన చెంగమ్మ అనే వృద్ధురాలు మృతిచెందింది. ఈమె మరణం ఒక్కటే అధికారిక లెక్కల్లో ఉంది. అనధికారికంగా పలువురు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రజలు కలవరపడుతున్నారు.

కడప రూరల్‌: ప్రస్తుత సీజన్‌ ఏ ఘడియలో అడుగు పెట్టిందో తెలియదు గానీ జిల్లాపై రోగాలు దండ యాత్ర చేస్తున్నాయి. అందులోనూ ‘స్వైన్‌ ఫ్లూ’ వ్యాధి అన్ని ప్రాంతాల్లోకి చొచ్చుకు పోతోంది. దీంతో జనాల బాధలు వర్ణణాతీతంగా మారింది.

ఎప్పుడూ లేదు
సాధారణంగా జిల్లాలో వైరల్‌ జ్వరాలు నమోదవుతుంటాయి. స్వైన్‌ ఫ్లూ కేసులు అరుదుగా ఉంటాయి. గతంలో ఏనాడు లేనివిధంగా గడచిన జనవరి నుంచి ఇప్పటి వరకు అధికారికంగా 44 కేసులు, అనధికారికంగా పలు కేసులు నమోదవుతున్నాయి. ఇది వైద్యులను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే జిల్లాను డెంగీ, మలేరియా,  వైరల్‌ ఫీవర్‌ తదితర వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పుడు స్వైన్‌ ఫ్లూ ప్రధాన సమస్యగా మారింది.

వ్యాధిని కనిపెట్టేలోపే...
జిల్లా వ్యాప్తంగా కడప రిమ్స్‌తో పాటు వైద్య ఆరోగ్య శాఖలో 75 పీహెచ్‌సీలు, 11 పట్టణ ఆరోగ్య కేందాలు, వైద్య విధాన పరిషత్‌లో 14 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. అయితే వ్యాధి నిర్ధారణకు సంబంధించిన పరీక్షల కేంద్రం ఒకటి కూడా ఇక్కడ లేకపోవడం దారుణం. కాగా కేసుల తీవ్రతను బట్టి కడప రిమ్స్‌లో ఇటీవల ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షాకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అది సేవలు అందించడానికి  మరికొన్నాళ్లు వేచి చూడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. తిరుపతిలోని స్విమ్స్‌ హస్పిటల్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపడతారు. అధికారికంగా జిల్లాకు సంబంధించి ఏ రోగికైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తి గొంతు, ముక్కు నుంచి తీసిన గల్ల లాంటి పదార్థాన్ని   తిరుపతికి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్‌ ఆధారంగా వ్యాధి ఉండేది, లేనిది నిర్ధారిస్తారు. అంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకున్న వారికే ఆ సౌకర్యం ఉంటుంది.

ఆ కేసులనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటిస్తుంది. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ను ఆశ్రయించిన వారు ఆ శాఖ పరిధిలోకి రారు. ఈ కారణంగా అనధికారికంగా ఎక్కువ కేసుల నమోదవుతున్నాయి.  రోగులు ప్రైవేట్‌ ఆసుపత్రుల బాట పడుతున్నారు. అక్కడా కుదరకపోతే ప్రాణాలను కాపాడుకోవడానికి హైదరాబాద్, కర్నూలు, తిరుపతి తదితర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. వ్యాధిని కనిపెట్టేలోపే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కాగా వైద్య ఆరోగ్య శాఖ వ్యాధులను అరికట్టడంలో వైఫల్యం చెందిందనే ఆరోపణలు వస్తున్నాయి. దోమలపై పోరాటం చేయవచ్చు. వైరల్‌ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. అయి తే గాలి ద్వారా వ్యాపించే ఈ వైరస్‌కు తాము ఎలా అడ్డుకట్ట వేయగలం అని అ శాఖ వర్గాలు అంటున్నాయి. వాతావరణం కాలుష్యం కారణంగా ఇదంతా జరుగుతోందని వారంటున్నారు.

హెచ్‌ 1, ఎన్‌ 1 వైరస్‌ కారణంగా...
ఈ వ్యాధికి దోమలతో ఎలాంటి సంబంధంలేదు. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అంటే అంటు వ్యాధి లాంటిది. ఇది హెచ్‌ 1, ఎన్‌ 1 వైరస్‌. గతంలో ఈ వ్యాధికి సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు సీజన్‌గా ఉండేది. ఇప్పుడా పరిస్థితిలేదు. ఏడాది పొడుగునా ఉంటోం ది. పరిసరాల అపరిశుభ్రత, వాతావరణంలో అనూహ్యంగా చేసుకుంటున్న మార్పులు.. వ్యక్తిగత శుభ్రతపై కొరవడిన అవగాహన. ఇవన్నీ వైరస్‌కు వరంగా మారాయి. ఫలితంగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.  గతంలో ఈ వైరస్‌ పందుల ద్వారా సంక్రమించేది. అనగా ‘స్వైన్‌’ అంటే పంది ‘ఫ్లూ’ అంటే జలుబు. తుమ్ములు, దగ్గుల ద్వారా ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తోంది.

Advertisement
Advertisement