'ఆక్రందనల నుంచి మాట్లాడుతున్నా'

6 Jan, 2020 09:59 IST|Sakshi
ధర్మపురంలో మాట్లాడుతున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం

తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని స్థానికుడిగా ప్రశ్నిస్తున్నా 

సచివాలయాల శంకుస్థాపనలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఉద్వేగభరిత ప్రసంగం

సాక్షి, పొందూరు: తరతరాలుగా వెనుకబాటు తనానికి గురవుతున్న ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే నీకేంటని(చంద్రబాబు) శాసనసభాపతి తమ్మినేని సీతారాం సూటిగా ప్రశ్నించారు. మండలంలోని ధర్మపురం, దల్లిపేట సచివాలయాల నిర్మాణాలకు ఆదివారం శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా ఆవేదనను వ్యక్త పరిచారు. పరిపాలనా వికేంద్రీకరణ చేసి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటే.. అవసరమైతే జైలుకేనా వెళ్లానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు.

తను రాజకీయాలు మాట్లాడటం లేదని.. ఉత్తరాంధ్ర పేదరికం, ప్రజల ఆకలి మంటలు, ఆక్రందనల నుంచి మాట్లాడుతున్నానని స్పష్టంచేశారు. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అక్రమంగా కొట్టేసిన వైనాన్నే శాసనసభలో బయట పెట్టామని గుర్తుచేశారు. ఒకప్పుడు కర్నూలులో, అనంతరం హైదరాబాద్‌లో రాజధాని ఉండేదని.. అవేవీ రాష్ట్రానికి మధ్యలో లేవని తెలిపారు. విశాఖపట్నం రాజధాని అయితే సముద్ర మార్గం, హైవే, రైల్వే మార్గం ఇలా అన్ని విధాలా అద్భుతమైన రవాణా వ్యవస్థ ఉందని వివరించారు.

చదవండి: ఉత్తరాంధ్ర వలసలపై స్పీకర్‌ కన్నీళ్లు

చరిత్రలో మిగిలిపోవాలి.. 
ఉత్తరాంధ్రలో ఆకలి మంటలు రగులుతున్నాయి.. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ ఆలోచనను మార్చుకోవాలని స్పీకర్‌ హితవు పలికారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదన్నారు. తాను స్పీకర్‌గా మాట్లాడటం లేదని.. ఈ ప్రాంతానికి తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని స్థానికుడిగా ప్రశ్నిస్తున్నానని స్పష్టంచేశారు. చరిత్రలో మిగిలిపోయేలా ఉత్తరాంధ్ర రాజధానిగా విశాఖపట్నాన్ని దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ టి.రామకృష్ణ, ఎంపీడీఓ బొడ్డేపల్లి మధుసూదనరావు, పంచాయతీరాజ్‌ డీఈ పొన్నాడ ధర్మారావు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్, పార్టీ మండల అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, సీనియర్‌ నాయకులు సువ్వారి గాందీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పప్పల మున్న, చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు కోరుకొండ సాయికుమార్, పీఏసీఎస్‌ అధ్యక్షుడు గంట్యాడ రమేష్‌, నాయకులు పెద్దింటి వెంకటరవిబాబు, బడి రఘురాంరెడ్డి మొదలవలస పాపారావు, పోతురాజు సూర్యారావు, పప్పల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా