Sakshi News home page

‘అందరికి ఆరోగ్యం’ అభాసుపాలు

Published Sat, Apr 7 2018 10:31 AM

TDP Government Negligance On Public health - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌):ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నినాదం అందరికీ అందుబాటులో ఆరోగ్య సేవలు(యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌) అభాసుపాలవుతోంది. జనాభాలో 50 శాతం ప్రజలకు తమకు ఏ రకమైన ఆరోగ్యసేవలు అవసరమో? అవి ఎక్కడ లభిస్తాయో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఫలితంగా సంపాదనలో అధిక భాగం ఆరోగ్య సేవలకే వెచ్చిస్తుండటంతో దారిద్య్రానికి లోనవుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన డబ్ల్యూహెచ్‌వో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ నినాదాన్ని ప్రకటించింది. అయితే ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది.

పథకాలున్నా.. అవగాహన సున్నా
కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆరోగ్య, సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్‌ వైద్యసేవగా మార్చింది. దాంతో పాటు ఆయనే ప్రవేశపెట్టిన 108, 104 సేవలను కొనసాగిస్తోంది. ఎన్టీఆర్‌ వైద్యసేవకు అదనంగా ఆరోగ్య రక్ష పేరుతో మరో పథకాన్ని తీసుకొచ్చింది. అయితే వీటి గురించి ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఇక ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా సేవలు అందిస్తున్న నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు క్లెయిమ్‌ మొత్తాన్ని నెలల తరబడి విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచుతుండటంతో కొన్ని ఆసుపత్రుల్లో అదనంగా అయ్యే మొత్తాన్ని రోగుల నుంచి వసూలు చేస్తున్నారు. 

వైద్య పరీక్షల నివేదికలకు నిరీక్షణ
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే వైద్య పరీక్షలు నివేదికలు కావాలంటే రోగులు మరో రోజు రావాల్సిందే. దూరాభారాన్ని లెక్కచేయకుండా వైద్యుల వద్దకు చికిత్స చేయించుకోవడానికి వచ్చే వారికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఏ రోజు పరీక్షల నివేదికలు ఆరోజే ఇచ్చి, వాటి ఆధారంగా చికిత్స చేసే అవకాశం రావాలని రోగులు కోరుతున్నారు. ఇక చంద్రన్న సంచార చికిత్స, 108 అంబులెన్స్‌ల్లోనూ మందుల కొరత వేధిస్తోంది. మృతదేహాలను ఇంటికి ఉచితంగా తీసుకెళ్లేందుకు ఏర్పాటైన మహాప్రస్తానం వాహనాలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకొరగా పనిచేస్తున్నాయి.  ఐదు వాహనాలున్నా అవి కేవలం పగలు మాత్రమే పనిచేస్తున్నాయి. రోజుకు 18 నుంచి 26 మందికి మరణిస్తున్నా ఐదారుగురికి మాత్రమే సేవలందిస్తున్నాయి. మిగిలిన వారు ప్రైవేటు అంబులెన్స్‌లపైనే ఆధారపడాల్సి ఉంటోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన వెంటనే ఇంటికి ఉచితంగా చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లో ఒక్కొక్కరిని గాకుండా ముగ్గురు, నలుగురు బాలింతలు ఒకేసారి తీసుకెళ్తున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. 

నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కర్నూలులోని ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్‌)లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జేవీవీఆర్‌కె ప్రసాద్‌ చెప్పారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్యసేవలపై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల అది వారి ఆర్థిక పరిస్థితిపై భారం పడుతోందన్నారు. తమ శాఖ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తుందన్నారు. సమావేశంలో పీవోడీటీటీ డాక్టర్‌ సరస్వతీదేవి, మలేరియా అదికారి డేవిడ్‌ రాజు, అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ దేవసాగర్, డెమో శారద, డిప్యూటీ డెమో ఎర్రంరెడ్డి పాల్గొన్నారు.

రీయింబర్స్‌మెంట్‌వైపే మొగ్గు
రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ పేరిట ఈహెచ్‌ఎస్‌ కార్డును తీసుకొచ్చింది. రీయింబర్స్‌మెంట్‌ స్థానంలో వచ్చిన ఈ కార్డు చాలా ఆసుపత్రుల్లో అమల్లో లేదు. దీనికితోడు ఈ కార్డును ఉపయోగించుకోవడానికి ఉద్యోగులు కూడా వెనుకంజ వేస్తున్నారు. అత్యవసర పరిస్థితిల్లో ఇది ఆదుకోవడం లేదని ముందుగా నగదు ఖర్చు చేసి తర్వాత రీయింబర్స్‌మెంట్‌ చేసుకుంటున్నారు. ఈ మొత్తాన్ని విడుదల చేయడానికి 20 నుంచి 50 శాతం వరకు కోత విధిస్తుండటం, ఖర్చు పెట్టిన మొత్తం కూడా ఏడాదైనా తిరిగి పొందలేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement