అచ్చిబాబును పక్కన పెట్టినట్టేనా? | Sakshi
Sakshi News home page

టీడీపీ సమావేశం రసాభాస

Published Tue, Dec 19 2017 8:52 AM

TDP leaders internal fight in Kovvur - Sakshi

కొవ్వూరు: టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశం అరుపులు కేకలతో దద్దరిల్లింది. మంత్రి ఎదుటే నాయకులు అసంతృప్తి గళం వినిపించడం చర్చనీయాంశమైంది. పార్టీలో మొదటి నుంచి కష్టించి పనిచేసే వాళ్లకు గుర్తింçపునివ్వడం లేదని ఓ సీనియర్‌ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ నాయకుల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు సమావేశంలో బయట పడ్డాయి. నియోజకవర్గానికి పెద్దదిక్కుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నేత పెండ్యాల అచ్చిబాబుకు తగిన ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదని  ఓ నాయకుడు నిలదీసినట్టు సమాచారం. తమ గ్రామంలో రేషన్‌ దుకాణం కేటాయింపు విషయంలోనూ అన్యాయం చేశారని ఆ నాయకుడు ఆరోపించినట్టు చెబుతున్నారు. ఇటీవల వాడపల్లిలో నిర్వహించిన జనచైతన్య యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అచ్చిబాబు ఫొటో ఎక్కడా ప్రచురించక పోవడానికి గల కారణం ఏమిటని ఆయన నిలదీసినట్టు తెలిసింది.

జవహర్‌కి టికెట్‌ కేటాయింపు సమయంలో అచ్చిబాబు పార్టీ అధినేత చంద్రబాబును ఒప్పించిన విషయం మరిచిపోవద్దంటూ హితవు పలికినట్టు సమాచారం. ఎన్నికల సమయంలో అచ్చిబాబు రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు ఆయన ప్రాధాన్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు తెలిసింది. కేవలం తాను అచ్చిబాబు మనిషి అన్న కారణంతోనే జిల్లాలో కీలక పదవి నుంచి తనను తొలగించారని ఆ నాయకుడు సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. పార్టీ సభ్వత్వాల కోసం మూడు నెలలు అహ ర్నిశలు కష్టపడ్డానని, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలకు గుర్తింపునివ్వ డంలేదని మండిపడినట్టు సమాచారం.

అభివృద్ధి పనుల్లోనూ అన్యాయం
అభివృద్ధి పనులు కేటాయింపులోను ప్రతిపక్ష నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యం కుడా పార్టీ నాయకులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ కోసం ఇన్నాళ్లు పని చేసిన కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తున్నారని నిలదీసినట్టు తెలుస్తోంది. పార్టీకి వీరవిధేయుడిగా పేరున్న ఆ నాయకుడి ప్రశ్నలకు ఏ ఒక్కరు నోరు మెదపలేదని సమాచారం.

అచ్చిబాబును పక్కన పెట్టినట్టేనా?
ఇటీవల చోటు చేసు కుంటున్న పరిణామాలు చూస్తుంటే అచ్చిబాబుకు పార్టీలో ప్రాధాన్యం తగ్గినట్టే ప్రచారం సాగుతోంది. ఇటీవల మండలంలోని ఓ గ్రామంలో నిర్వహించిన  సమావేశంలో కొవ్వూరు నాయకులు తమ గ్రామంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతోనే సమావేశానికి రాలేదని ఓ ముఖ్య నాయకుడు ఆరోపించడంపైనా పట్టణానికి చెందిన ప్రముఖ నాయకులు నియోజకవర్గ సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.   వ్యక్తిగత కారణాలతో సమావేశానికి హాజరు కాలేదని, అంతమాత్రాన ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేస్తారా అని నిలదీసినట్టు తెలిసింది. దీంతో  సమావేశం రసాభాసగానే ముగిసింది. సమావేశంలో నాయకులు  జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ మద్దిపట్ల శివరామకృష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శి కేవీకే రంగారావు, జడ్పీటీసీ కైగాల మంగాభవానీ, కైగాల శ్రీనివాసరావు,కాకర్ల బ్రహ్మాజీ, అనుపిండి చక్రధరరావు, కోడూరి ప్రసాద్, వట్టికూటి వెంకటేశ్వరరావు, పాలడుగుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement