నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు 

31 Aug, 2019 08:24 IST|Sakshi
సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న దృశ్యం (ఫైల్‌)

దోపీడీదారులే రోడ్డెక్కుతున్న వైనం

ఇసుక కోసం కపట ప్రేమ

టీడీపీ నేతల తీరుపై సర్వత్రా విస్మయం 

అధికారంలో ఉన్నంతకాలం నదులనే కాదు వాగులు, వంకలను కూడా వదల్లేదు. ఇసుక దోపిడీకి తెగబడ్డారు. ఉన్న పళంగా రూ.కోట్లకు పడగెత్తారు. రూ.1500 కోట్లకు పైగా టీడీపీ నేతలు ఆర్జించారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇప్పుడా నేతలకు వీలుపడటం లేదని సామాన్యుల కోసమంటూ.. రోడ్డెక్కుతున్నారు. దోపిడీకి గురి కాకూడదని, తక్కువ ధరకు ఇసుకను అందించాలన్న ఉద్దేశంతో కొత్త ఇసుక పాలసీని రూపొందించి, మరో ఐదు రోజుల్లో అమలు చేసేందుకు కొత్త ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ పచ్చనేతలు ఇసుక రాజకీయాలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఎవరైతే ఇసుకను దోచుకున్నారో వారే నేడు ఇసుక కోసం ధర్నాలకు దిగుతున్నారు. సెప్టెంబర్‌ 5నుంచి వచ్చే పాలసీ తమ వల్లే వచ్చిందని చెప్పుకునేందుకు కూడా ఆరాటపడుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదులు గత ఐ దేళ్ల కాలంలో బక్కచిక్కిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి గుల్లగా మారిపోయాయి. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఏ ఒక్కదాన్నీ విడిచిపెట్టలేదు. నిరాటంకంగా ఇసుక దోపిడీ సాగించారు. టీడీపీ నాయకులు మాఫియాతో చేతులు కలిపి ఇసుకను దోచుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఘనంగా ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక విధానం సామాన్యులకు ఉపయోగపడలేదుగానీ టీడీపీ నేతలకు మాత్రం కాసులు కురిపించింది. ఇసుక ర్యాంపులను తమ అడ్డాగా చేసుకుని కోట్ల రూపాయలు దోచుకున్నదెవరంటే టీడీపీ నాయకులని ప్రజల వేళ్లు చూపిస్తాయి. టీడీపీ నేతలు, వారి అనుయాయులకు ఉచిత ఇసుక విధానం బంగారు బాతులా మారిపోయిన విషయం  తెలిసిందే. నదులనే కాదు థర్డ్‌ ఆర్డర్‌ స్ట్రీమ్‌ కింద వాగులు, వంకలను కూడా వదలకుండా మింగేశారు.

నిబంధనలకు విరుద్ధంగా..
జిల్లా సాండ్‌ కమిటీ పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల నుంచే ఇసుకను తవ్వాల్సి ఉన్నా అనుమతులతో సంబంధం లేకుండా, పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ మాఫియా నదుల్లో కాసుల వేట సాగించారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలు ఉన్నా అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ర్యాంపుల్లో జేసీబీలు, పొక్లెయిన్లతో తవ్వకాలు జరిపిన దాఖలాలు ఉన్నాయి. లారీలను నేరుగా నదిలోకి తీసుకెళ్లి మరీ ఇసుకను నింపేశారు. వంతెనలకు, ఇరిగేషన్‌ పంపులు, వాటర్‌ ఫిల్టర్‌ సంపులకు 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలను చేపట్టాలి. కానీ నిబంధనలు ఎక్కడా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం రీచ్‌ ఒడ్డున మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నది లోపలకు మిషనరీ వాహనాల వెళ్లకూడదు. ఇసుక తవ్వకాలను వినియోగించకూడదు. కానీ నదుల్లోకి రోడ్డులేసి మరీ తవ్వుకుపోయారు. రీచ్‌ల వద్ద లారీకి రూ.6 వేల నుంచి 10 వేల వరకూ వసూలు చేసిన దాఖలాలున్నాయి.

నేతలపై ఆరోపణలు.. 
ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్న వంశధార, నాగావళి నదుల్లో అక్రమంగా నిర్వహించిన ఇసుక ర్యాంపుల్లో నాటి ఎమ్మెల్యే కూన రవికుమార్‌ బంధువులు, అనుచరగణం పాత్ర అందరికీ తెలిసిందే. అప్పట్లో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. పోతయ్యవలస ర్యాంపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా నదిలోనే లారీలు రాకపోకలు సాధించాయంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం ర్యాంపు వద్ద ఇసుక కోసం వందల సంఖ్యలో లారీలు బారులు తీరిన సందర్భాలుండేవి.  ఆమదాలవలస మండలం దూసి రైల్వే వంతెన సమీపంలో నాగావళి నదిలో ఇసుక తవ్వకాలు జరిపిన దాఖలాలు ఉన్నాయి.  పురుషోత్తపురం ఇసుక ర్యాంపులోనైతే 25 లారీలతోపాటు నాలుగు జేసీబీలు వరద పోటుకు మునిగిపోయాయి. డ్రైవర్లు, క్లీనర్లు వరద దిగ్బంధంలో చిక్కుకున్నారు. రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి తవ్వకాలు చేస్తుండగా వరద ముంపునకు గురయ్యారు. ఆ వాహనాలన్నీ కూన రవికుమార్‌ ప్రధాన అనుచరులవేనంటూ కోడై కూసింది.  
-శ్రీకాకుళం రూరల్‌ మండలం పరిధిలోని పొన్నాం–బట్టేరు ఇసుక ర్యాంపుల నిర్వహణలో అచ్చెన్నాయుడు అనుచరులు దందా చేశారన్న వాదనలు ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్‌ బట్టేరు వద్ద అయితే ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకు గ్రామ రెవెన్యూ అధికారులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. కల్లేపల్లి, భైరీ ర్యాంపుల్లో టీడీపీ నేతల ఆగడాలు తెలిసిందే. 
-నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం తదితర ర్యాంపుల్లో నాటి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అనుచరులు భారీగా వసూళ్లు చేశారన్న వాదనలు ఉన్నాయి. 
-పాతపట్నం నియోజకవర్గంలో మాతల వద్ద నాటి ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు జరిగాయన్నది అందరికీ తెలిసిందే.  
-ఎచ్చెర్ల నియోజకవర్గంలో తమ్మినాయుడుపేట, ముద్దాడ పేట, పొన్నాడలో అనధికార ఇసుక ర్యాంపులు నడిచాయి. నాటి జెడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, నాటి మంత్రి కళా వెంకటరావు మధ్య వివాదం కూడా నడిచింది. ఇసుక ర్యాంపుల్లో వాటాల గురించి టీడీపీ నేతలు గొడవకు దిగిన దాఖలాలున్నాయి.

టీడీపీ రాకముందు... అధికారంలోకి వచ్చాక...
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుక ట్రాక్టరుకు రీచ్‌ వద్ద రూ.100కు మించకుండా సీనరేజి వసూలు చేసేవారు. దీనివల్ల సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాదు పెద్ద భవంతుల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమైనా పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. మరోవైపు సీనరేజి రూపేణా జిల్లాలో ఏటా రూ.50 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇలా వచ్చిన నిధులను స్థానిక సంస్థల మౌలిక సౌకర్యాల కల్పనకు ఖర్చు పెట్టేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పెద్ద ఆదాయ వనరుగా మార్చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మరీ దోపిడీకి తెరతీశారు. ఈ ఐదేళ్లూ రోజుకు రాత్రి వేళ సుమారు 300 లారీల వరకు ఇసుకను విశాఖ తదితర జిల్లాలకు అక్రమ రవాణా సాగించారు. విశాఖ మార్కెట్‌లో లారీ ఇసుక డిమాండ్‌ను క్యాష్‌ చేసుకున్నారు. లారీ ఇసుక రూ.20 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మొత్తానికి ఐదేళ్లలో రూ.1500 కోట్ల వరకు అక్రమంగా ఆర్జించారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా