ఊరూరా సంబురం | Sakshi
Sakshi News home page

ఊరూరా సంబురం

Published Sat, Oct 5 2013 3:46 AM

Telangana celebrations in Mahabubnagar district

పాలమూరు, న్యూస్‌లైన్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ కేంద్ర కేబి నెట్ టీనోట్‌కు ఆమోదముద్ర వేయడంతో జిల్లా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ర్యాలీలు, బాణా సంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి ఒకరితో మరొకరు ఆనందాన్ని పంచుకుకున్నారు.
 
 పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలతో పాటు ఉ ద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాలు సంబరాల్లో మునిగి తేలారు. జిల్లా కేంద్రంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పా ల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర సమచార పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ వా దులు ఘనంగా స్వాగతం పలికారు.
 
 కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వాసవీ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి జై తెలంగాణ నినాదాలు చేశారు. పాలమూరు యూనివర్సిటీలో సంబరాలు మిన్నంటాయి.
 
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో గద్వాల నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు, తెలంగాణ వాదులు, ఉద్యోగ, విద్యార్థి సంఘాల జేఏసీలు శుక్రవారం వేర్వేరుగా రోడ్డుపై సంబరాలు చేసుకున్నారు. బీజేపీ నాయకులు, ఏబీవీపీ నాయకులు కృష్ణావేణి చౌరస్తాలో పెద్దఎత్తున టపాసులు కాల్చి, తెలంగాణ నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
 
 జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లురవి స్వయంగా బాణాసంచా కాల్చి పార్టీ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. నాగర్‌కర్నూల్‌లో జెడ్పీ మాజీ చైర్మన్ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేపట్టారు. డివిజన్‌స్థాయి టీజేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై నృత్యాలు చేశారు. నారాయణపేటలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
 
 బీజేపీ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. మక్తల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి, అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. తెలంగాణకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇవ్వడం వల్లే కేంద్రంలో కదలిక వచ్చిందని నాయకులు అభిప్రాయపడ్డారు. షాద్‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకద్ర, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన శ్రేణులు, కార్యకర్తలు, తెలంగాణ వాదులు బాణాసంచా కాల్చి తెలంగాణ సంబరాలు జరుపుకున్నారు.  
 

Advertisement
Advertisement