‘పది’ వేల కష్టాలు | Sakshi
Sakshi News home page

‘పది’ వేల కష్టాలు

Published Sat, Dec 27 2014 3:40 AM

‘పది’ వేల కష్టాలు - Sakshi

 కడప రూరల్ : జిల్లాలోని స్వయం సహాయ మహిళా సంఘాలకు చెందిన సభ్యులు రుణమాఫీ ప్రకటనతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సంఘాల్లో ని సభ్యులు దాదాపు 90 శాతం మందికిపైగా నిరుపేదలు,అట్టడుగు వర్గాలకు చెందిన వారు కావడంతో ఇబ్బందులకు లోనవుతున్నారు.
 
 జిల్లాలో మొత్తం 34 వేల సంఘాలు
 జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో మొత్తం 34 వేల సంఘాలు ఉన్నాయి. అందులో 3.40 లక్షల మందికిపైగా సభ్యులు ఉంటున్నారు. వీరంతా మొత్తం రూ.619 కోట్లు రుణాలను పొందారు. చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణమాఫీ పరిధిలోకి మొత్తం 29,436 సంఘాలు వచ్చాయి. మొదట చంద్రబాబునాయుడు రుణమంతా మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకారమైతే మొత్తం రూ.619 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కాగా రుణ అర్హత పరిధిలోకి 29,436 సంఘాలు వచ్చాయి. అందులో 2.9 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. అనంతరం చంద్రబాబు ఒక్కో సభ్యురాలికి రూ. 10 వేలు చొప్పున మాత్రమే చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకారమైనా దాదాపు రూ. 294.36 కోట్లను అర్హులైన సభ్యులకు అందించాల్సి ఉంది.
 
 ఖాతాల వివరాలు పంపిన డీఆర్‌డీఏ
 గడిచిన అక్టోబరు చివరిలో పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) జిల్లాకు రూ. 10 వేలు చొప్పున ఎంత అవసరమో లెక్క తేల్చింది. ఆ మేరకు దాదాపు రూ. 294.36 కోట్లు అవసరమని గుర్తించింది. ఆ సమాచారాన్ని జిల్లా డీఆర్‌డీఏకు తెలిపింది. అలాగే సభ్యుల ఖాతాల వివరాలు పంపాలని కోరింది. ఆ ప్రకారం డీఆర్‌డీఏ అధికారులు సభ్యుల ఖాతాల వివరాలను పంపారు. తర్వాత ఇంతవరకు రూ.10 వేల చెల్లింపు సంగతిని ప్రభుత్వం ఏ రోజు పట్టించుకోకపోవడంతో అయోమయం నెలకొంది.
 
 నమ్మి మోసపోయిన సభ్యులు
 గత ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు హామీలను గుప్పించారు. రైతులతోపాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. డ్వాక్రా సంఘ సభ్యులు తమ నెలవారి కంతులు సక్రమంగా చెల్లించేవారు. వీరంతా నిరుపేదలు, దినసరి కూలీలైనప్పటికీ తీసుకున్న సొమ్మును సక్రమంగా చెల్లిస్తుండేవారు. ఈ తరుణంలో తెలుగుతమ్ముళ్లు మీరు ఎలాంటి రుణాలు కట్టవద్దని అడ్డు తగలడంతో రుణాలన్నీ పూర్తిగా మాఫీ అవుతాయని ఆశించిన సభ్యులు కంతులను కట్టకుండా నిలిపివేశారు.
 
 అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు నా దారి అడ్డదారి అని నిరూపించుకున్నారు. అంతకముందు రుణమంతా మాఫీ అన్న ఆయన ఒక సంఘానికి రూ. లక్ష చొప్పునమాఫీ చేస్తామని ప్రకటించారు. తెల్లవారేసరికి ఒక్కొ సభ్యురాలికి రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తామని తెలిపారు. దీంతో అందరూ బిత్తరపోయారు. ఇక బ్యాంకర్లు కూడా తమకు నెలసరి కంతు తప్పనిసరిగా చెల్లించాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో సంఘ సభ్యులు గందరగోళంలో పడ్డారు.
 
  సక్రమంగా కంతులు చెల్లిస్తూ ఉండి ఉంటే వారిపై పెద్దగా భారం  పడేది కాదు. ఒక్కసారిగా పెండింగ్‌లో ఉన్న కంతులను చెల్లించాల్సి రావడంతో పాపం సంఘ సభ్యులు అప్పుల వాళ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. మరికొంతమంది ఉన్నకాస్త ముక్కుపుడుకలు, కమ్మలు తదితర బంగారు వస్తువులను కుదవ పెట్టడమో, అమ్ముకోవడమో చేయాల్సి వచ్చింది. రైతు రుణమాఫీనే ఇంతవరకు సక్రమంగా జరగలేదు....ఇక మాపరిస్థితి ఏంటని స్వయం సహాయక సంఘాల మహిళలో అయోమయంలో పడ్డారు. బాబు మాటలు నమ్మి పది వేల కష్టాలు పడుతున్నామని  వాపోతున్నారు.
 
 త్వరలో మాఫీ ఉండవచ్చు!
 జిల్లాకు సంబంధించి స్వయం సహాయక మహిళా సభ్యులకు ఒకరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ. 294 కోట్లకు పైగా వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెబుతోంది. త్వరలో ఆ రూ. 10 వేలు సభ్యుల ఖాతాల్లో పడవచ్చు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే చర్యలు చేపడతాం.
 - అనిల్‌కుమార్‌రెడ్డి,
 ప్రాజెక్టు డెరైక్టర్, డీఆర్‌డీఏ
 

Advertisement
Advertisement