పది పరీక్షల్లో 88.05 శాతం ఉత్తీర్ణత | Sakshi
Sakshi News home page

పది పరీక్షల్లో 88.05 శాతం ఉత్తీర్ణత

Published Fri, May 16 2014 2:18 AM

Tenth class exams 88.05 percent released

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: ప్రభుత్వం పదోతరగతి పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేసింది. నెల్లూరు జిల్లా 88.05 శాతం విజయాన్ని సొంతం చేసుకుని రాష్ట్రంలో 16 స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాలు తూర్పుగోదావరి, కడప జిల్లాలు దక్కించుకున్నాయి. ఫలితాల్లో గత ఏడాది రాష్ట్ర స్థాయిలో 15వ స్థానాన్ని దక్కించుకున్న జిల్లా ఒక మెట్టు దిగి 16వ స్థానాన్ని పొందింది. గత సంవత్సర ఫలితాలతో పోల్చితే 87.35 శాతం నుంచి 88.05 శాతానికి ఎగబాకింది.
 
 అంటే జిల్లాలో 0.70 శాతం అదనంగా ఫలితాలు పొందింది. ఈ సంవత్సరం సమైక్య బంద్‌లు, విద్యార్థి సంఘాల నిరంతర ఆందోళనల మధ్య చదువు సరిగా కొనసాగలేదు. ఫలితాలు ఎలా వస్తాయోనని విద్యార్థులు, త ల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వెలువడిన ఫలితాలు మెరుగ్గానే వచ్చాయి.  జిల్లా మొత్తం మీద 30,808 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో బాలురు 15,856 మంది రాశారు.
 
 13,884 మంది ఉత్తీర్ణత పొంది 87.56 శాతం విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాలికలు 14,952 మంది పరీక్షలు రాసి 13,243 మంది ఉత్తీర్ణ పొంది 88.57 శాతం విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇద్దరి ఫలితాలు కలిపితే జిల్లా సరాసరి ఉత్తీర్ణత శాతం 88.05గా నమోదైంది. బాలుర కంటే  బాలికలు 1.1 శాతం అదనంగా విజయాన్ని సొంతం చేసుకుని ఎప్పటిలాగే ఉత్తీర్ణత శాతంలో బాలికలు తమ హవా కొనసాగించారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 88 మంది పదికి పది పాయింట్లు సాధించి ఏ-1 గ్రేడు స్థానాన్ని నిలుపుకున్నారు.
 
 ప్రభుత్వ పాఠశాలల్లో సైతం
 ఏ-1 గ్రేడులు:
 రాత్రి వరకు ఆన్‌లైన్‌లో పరిశీలించిన సమాచారం మేరకు జిల్లాలోని ఉదయగిరి మండలంలోని అప్పసముద్రం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం.అనూష, కావలి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కె.జగదీశ్వరి, చేజర్లలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఏ.శ్రీహర్ష పదికి పది పాయింట్లు సాధించి గ్రేడు-1 స్థానాన్ని దక్కించుకున్నారు. మరి కొంతమంది విద్యార్థులు కూడా ఇదే గ్రేడు పొంది ఉండవచ్చని వివరాలు తెలియాల్సి ఉందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇవి కాక జిల్లాలో ఏ-2, బి-1, బి-2 ఫలితాలు అనేక మంది పొందారు.

 ప్రైవేటు పాఠశాలల హవా:
 ఏ-1 గ్రేడు సాధనలో ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు తమ హవాను కొనసాగించాయి. వేణు డెరైక్టర్‌గా ఉన్న రత్నం పాఠశాల 11, నారాయణ, డాక్టర్ కిశోర్ రత్నం, రవీంద్రభారతి,  శ్రీచైతన్య, హిమాలయ, రాఘవ, లిల్లీలిటిల్ ఫ్లవర్, లిటిల్‌ఏంజిల్స్ తదితర పలు ప్రైవేటు పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాయి.
 
 కార్పొరే షన్
 పాఠశాలల హవా
 నెల్లూరు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు తమ హవాను కొనసాగించాయి. 15 పాఠశాలలకు చెందిన 982 మంది పరీక్షలు రాయగా 717 మంది ఉత్తీర్ణత పొంది 73 శాతం విజయాన్ని అందుకున్నారు. నగరంలోని రంగనాయకుల పేటలోని పీఎన్‌ఎం ఉన్నత పాఠశాల విద్యార్థులు 93 శాతం విజయాన్ని అందుకుని కార్పొరేషన్ పాఠశాలల్లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. గాంధీనగర్‌లోని మున్సిపల్ పాఠశాల 90 శాతం, మూలాపేటలోని రామయ్యబడి మున్సిపల్ పాఠశాల 83 శాతం ఫలితాలతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి.
 
 బీవీనగర్‌లోని కేఎన్‌ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి జ్ఙానేశ్వర్ 9.8 గ్రేడును సాధించి నగరపాలక పాఠశాలల్లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇదే పాఠశాలకు చెందిన జాస్మిన్ 9.7, పీఎంఆర్ మున్సిపల్ పాఠశాలకు చెందిన స్వప్నా పీటర్ 9.7, వైవీఎం పాఠశాలకు చెందిన కె.బాలాజీ 9.7 గ్రేడు పొంది ద్వితీయ స్థానాలు దక్కించుకున్నారు. కార్పొరేషన్ పాఠశాలల్లో ఉన్నత పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను యూటీఎఫ్ నాయకులు సుబ్బారావు, మధు ఒక ప్రకటనలో అభినందించారు.
 

Advertisement
Advertisement