అవినీతి వలయంలో అనగాని | Sakshi
Sakshi News home page

అవినీతి వలయంలో అనగాని

Published Sun, Jan 25 2015 1:02 AM

అవినీతి వలయంలో అనగాని

రేపల్లె : అవినీతిపరులకు ప్రజాప్రతినిధులు కొమ్ముకాస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్నిహితంగా మసలే అనుచరులకు వత్తాసు పలుకుతూ జూద సంస్కృతిని ప్రోత్సహించడమేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అవినీతి వలయంలో చిక్కుకుంటున్నారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.

నకిలీ పాస్‌పుస్తకాలతో భారీ మొత్తంలో బ్యాంకు రుణాలు పొందిన వ్యవహారంలో ఎమ్మెల్యే అనుచరులే కీలకంగా వ్యవహరించినట్లు స్పష్టం కాగా.. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన కోడి పందేలనూ వారే జూదంగా మార్చారని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే పోకడలకు నియోజకవర్గంలో పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని భావించిన కొందరు టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం.
 
ఎకరం భూమి కూడా లేని ఎమ్మెల్యే ప్రస్తుత పీఏ సమీప బంధువు యార్లగడ్డ వెంకటేశ్వరరావు 15 ఎకరాలు ఉన్నట్లు నకిలీ పాస్‌పుస్తకాలు చూపి, తనతో పాటు కుటుంబసభ్యులపేర్లపై నగరం పీఏసీఎస్, ఇండియన్ బ్యాంక్‌లలో సుమారు రూ.7లక్షల రుణం పొందారు.
 
2007లో నకిలీ పాస్‌పుస్తకాలతో చెరుకుపల్లి మండలం ఆరుంబాక బ్రాంచ్‌లో రుణాలు పొందిన 72 మందిపై 2012లో నగరం పోలీస్ స్టేషన్‌లో కేసునమోదు కాగా వారిలో ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండే లుక్కా గుడారంకయ్య ఉన్నారు.
 
లుక్కా గుడారంకయ్య తనతోపాటు తండ్రి, తల్లిపేర్లతోనూ రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నారు. దీంతో పాటు ప్రస్తుతం నగరం పీఏసీఎస్‌లో భార్యపేరు, అతని పేరుపై రుణం పొందారు.
 
ఇలా నిత్యం ఎమ్మెల్యేని అంటిపెట్టుకుని ఉండే వారే ఎక్కువగా నకిలీ పాస్‌పుస్తకాలతో రుణం పొందటంతో వీరిని కాపాడుకునే పనిలో  అనగాని ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
 
పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ సంక్రాంతికి రేపల్లె మండలం గుడ్డికాయలంకలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన కోడి పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సమాచారం.
 
పందేల్లో డబ్బు చేతులు మార్చింది ఆయన అనుచరులేనని, జూద సంస్కృతిని ప్రోత్సహిండం ఏమిటని స్వపక్షం నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి.  
 
నకిలీపాస్ పుస్తకాల వ్యవహారంపై విచారణ చేయించి, సూత్రదారులను అరెస్ట్ చేసే విధంగా ఎమ్మెల్యే చర్యలు చేపట్టాలని టీడీపీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement