పోటీ రసవత్తరం | Sakshi
Sakshi News home page

పోటీ రసవత్తరం

Published Thu, Mar 6 2014 11:20 PM

the aim of vikarabad  municipal chairman position

వికారాబాద్, న్యూస్‌లైన్ : మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్‌కు రిజర్వ్ కావడంతో వికారాబాద్‌లో పోటీ రసవత్తరంగా మారింది. ఎలాగైనా చైర్మన్ పదవి దక్కించుకునేందుకు మాజీ కౌన్సిలర్లతో పాటు ఆయా పార్టీల్లో ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజర్వేషన్ల కోటాలో గెలిచి ఆయా వార్డుల్లో పెత్తనం చెలాయించిన వారు.. ప్రస్తుతం జనరల్ వార్డులపై కన్నువేశారు. వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి చేపట్టాలంటే ఉన్న జనరల్ వార్డుల నుంచే ఎన్నికవ్వాలి కాబట్టి.. పట్టణంలోని 3, 4, 10, 12, 24 వార్డులపై అందరూ దృష్టి సారించారు. ఎక్కడైతే పోటీ, ఖర్చు తక్కువగా ఉంటుందో ఆ వార్డుల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరైతే ఏకంగా వేర్వేరు వార్డుల్లో భార్యాభర్తలు పోటీ చేయాలని యోచిస్తున్నారు.

ఇదిలాఉంటే ఎలాగైనా సరే చైర్మన్ పదవి దక్కించుకోవాలనే వ్యూహంతో అందరూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రెండు మూడు రోజులుగా మాజీ కౌన్సిలర్లు, బంధువులు, అనుచరులతో కలిసి ఆయా వార్డులకు వెళ్లి ఓటర్లను పలకరిస్తున్నారు. పాత పరిచయాలు గుర్తు చేస్తూ, దూరపు బంధుత్వాలు కలుపుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆయా వార్డుల్లోని ముఖ్య నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఆయా పార్టీల నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారు కూడా ప్రయత్నాల్లో, ప్రచారంలో తీసిపోవడం లేదు.

 ఆయా వార్డుల్లో  తమ వర్గానికి చెందిన ఎన్ని ఓట్లు ఉన్నాయనేది లెక్కలు తీస్తున్నారు. అలాగే తమకు ప్రత్యర్థులుగా నిలిచేదెవరు, వారికి ఎవరితో ఫోన్ చేయిస్తే వింటారు అనే అంశాలపైనా దృష్టి సారించి, ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ నెల పదో తేదీన నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండటంతో లాబీయింగ్ ముమ్మరం చేశారు. ఎవరికి వారు అనుచరులను కూడగట్టుకొని అధిష్టానాల వద్ద బలనిరూపణకు సైతం సిద్ధమవుతున్నారు. పార్టీ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్‌గానైనా సరే బరిలో దిగాలని పలువురు నిర్ణయించుకున్న ట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement