ఓటమి విజయానికి తొలి మెట్టు | Sakshi
Sakshi News home page

ఓటమి విజయానికి తొలి మెట్టు

Published Wed, Aug 27 2014 2:27 AM

ఓటమి విజయానికి తొలి మెట్టు

కడప ఎడ్యుకేషన్:  విద్యార్థులు ఏవిషయంలోనైనా ఓటమి చెందామని మనస్తాపం చెందవద్దని, ఆ ఓటమే రేపటి విజయానికి తొలిమెట్టు అవుతుందని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడప నగరం మరియాపురంలోని సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మంగళవారం ఇన్‌స్పైర్ ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీఈఓ అంజయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను విద్యాశాఖ నిర్వహించడం అభినందనీయమన్నారు.
 
ఒకప్పుడు రత్నాల సీమగా ఉన్న రాయలసీమ నేడు రాళ్ల సీమగా మారిందన్నారు. విద్యార్థులు బాగా చదివి మంచి స్థాయికి ఎదిగి రాళ్ల సీమ పేరును రత్నాల సీమగా మార్చాలన్నారు. నేడు విద్యారంగం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఎగ్జిబిట్స్ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలన్నారు. సంబంధిత కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. సంబంధిత విషయంలో తమవంతు కృషి చేస్తానన్నారు.

రాష్ట్రస్థాయిలో ఇన్‌స్పైర్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. డీఈఓ అంజయ్య మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఎంపికైన స్ఫూర్తితోనే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని సూచించారు. ఈ ప్రాజెక్టుల తయారీకి పిల్లల మేథాశక్తిని కొనియాడారు. పిల్లలు చదవుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఎదిగి దేశం పేరు నిలబెట్టాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక నూతన ఒరవడితో ముందుకు సాగాలన్నారు.డిప్యూటీ డీఈఓ రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మూడేళ్ల నుంచి నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఇన్‌స్పైర్‌లో ప్రతి ప్రధానోపాధ్యాయుడు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలన్నారు.
 
ప్రతి పాఠశాలలో సైన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి దాని పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. వయోజన విద్య ఉపసంచాలకులు సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న చిన్న ప్రయోగాలతోనే విద్యార్థులకు ప్రేరణ వస్తుందన్నారు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం మంది విద్యకు దూరంగా ఉన్నారన్నారు. ఎంఈఓ నాగమునిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాల ఈ సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనడానికి ముందుకు రావాలన్నారు. వీటితోపాటు ప్రైవేటు పాఠశాలలు కూడా పాల్గొనవచ్చన్నారు.   
 
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ ప్రసన్నాంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి రెహ్మాన్, డీఈఓ కార్యాలయ ఏడీ సుబ్రమణ్యం, డీసీఈబీ సెక్రటరీ వెంకట రామిరెడ్డి, వైవీయూ అధ్యాపకులు వెంకట్రామ్, ఉస్మాన్, హెడ్మాస్టర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షులు రామచంద్రారెడ్డి, మరియాపురం స్కూలు సిస్టర్స్ శీల, లీలా రోజ్, పలు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు రమణారెడ్డి, రమేష్‌రెడ్డి, సుబ్బారెడ్డి, లలితాభాయి, మేషక్‌బాబు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement