Sakshi News home page

నిలిచారు..గెలిచారు

Published Thu, Feb 12 2015 12:35 AM

నిలిచారు..గెలిచారు - Sakshi

రైతుల పక్షాన పోరాడిన వైఎస్సార్ సీపీ నేతలు
రెండో పంటకు సుముఖత వ్యక్తం చేసిన సర్కారు
రాజధాని ప్రాంత రైతుల్లో ఆనందం
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అండతోనే సాధ్యమైందని స్పష్టీకరణ

 
మంగళగిరి/తాడేపల్లి రూరల్ : రాజధాని భూ సమీకరణ గ్రామాల్లో అంగీకారపత్రాలు ఇవ్వని వారు నిరభ్యంతరంగా రెండో పంట వేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంపై  రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ రాజధాని భూ సమీకరణ గ్రామాల్లో రెండో పంటకు అనుమతి లేదన్నారు. దీంతో రాజధాని గ్రామాలతోపాటు అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై వ్యతి రేకత వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నేతృత్వంలో వైఎస్సార్ సీపీ నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. రెండో పంట వేస్తే తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రధానంగా ఎమ్మెల్యే ఆర్కే వినూత్నరీతిలో నిరసనలు తెలుపుతూ రైతులకు అండగా నిలిచారు. ఓ రోజంతా కూలీగా పొలం పనులు చేశారు. ఉల్లిపాయల బస్తాలు మోశారు. లోడు లారీని నడిపారు. మరో రోజు భిక్షాటన చేశారు. ఇలా ఆందోళనలో రైతుల వెన్నంటి నిలిచారు. ఓ వైపు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన, మరో వైపు ఈ అంశం రాష్ట్రం దాటి దేశవ్యాప్త చర్చకు దారితీసింది.

ఈ పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు వెనకడుగు వేసింది. సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చిన భూముల్లో మాత్రమే పంటలకు అనుమతి లేదని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ మంగళవారం ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ అండగా నిలవడంతోనే నేడు రెండో పంటకు మార్గం సుగమం అయిందని చెపుతున్న రైతుల మనోభావాలు వారి మాటల్లోనే..
 
రైతుల వెంట వైఎస్సార్ సీపీ నిలిచింది...

రెండో పంట వేయకూడదని చెప్పడమే ప్రభుత్వం తప్పు. ప్రభుత్వంపై పోరాటంలో రైతుల తరఫున వైఎస్సార్ సీపీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే నిలబడటం వలనే ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంది.  సమీకరణకు భూములు ఇచ్చిన వారు సైతం మళ్లీ ఆలోచించుకోవాలి. పంటలు లేకపోతే ఎలా బతుకుతారు.
 -  బొమ్మారెడ్డి సాంబిరెడ్డి, రైతు, నిడమర్రు

వైఎస్సార్ సీపీ పోరాట ఫలితమే...

వైఎస్సార్ సీపీ పోరాటం కారణంగానే రైతుల్లో అవగాహన కలిగి రెండో పంటపై ఆందోళనకు దిగారు. భవిష్యత్తులో ఇదే విధంగా అండగా నిలబడి ఎమ్మెల్యే ఆర్కే మా భూములను కాపాడతారనే నమ్మకముంది.
 - తాడిశెట్టి శ్రీనివాసరావు, రైతు,నిడమర్రు.
 
ఎమ్మెల్యే ఆర్కే ధైర్యం చెప్పారు...


రాజధాని పేరుతో ప్రభుత్వం పంట పొలాలు లాక్కుంటే ఎలా బతకాలంటూ తీవ్ర ఆందోళన చెందుతున్న సమయంలో  వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పంట పొలాలలో పనిచేస్తున్న మాకు ధైర్యం చెప్పారు. మీ వెంట జగనన్న ఉన్నాడు. చివరి వరకు పోరాడాదామని భరోసా ఇచ్చారు. ఈ రోజు రైతులు మన భూముల్లో రెండో పంట వేసుకోవచ్చని చెప్పడం చాలా ఆనందంగా ఉంది.
 - మానెకొండ  పద్మ, వ్యవసాయ కూలీ

ఆర్కే చలవతోనే రెండవ పంటకు అవకాశం

మొదటి నుంచి పెనుమాక, ఉండవల్లి రైతులు భూ సమీకరణకు వ్యతిరేకంగా వివిధ రూపాలలో ఆందోళన చేశారు.మా అందరికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అండగా ఉండి, ఉద్యమాన్ని వివిధ రూపాల్లో ముందుకు తీసుకెళ్ళి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అందువల్లే  ఈ రోజు రెండవ పంటలు వేయడానికి ప్రభుత్వం ఒప్పుకుంది.
     - వెంకటరెడ్డి,రైతు,పెనుమాక
 
ఎమ్మెల్యే ఆర్కేపై మాకు నమ్మకం ఉంది..

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రైతుల తరఫున నిలిచి పోరాటం చేయడం వల్లే ఈ రోజు ప్రభుత్వం దిగివచ్చింది.  చివరకు భిక్షమెత్తి నిరసన తెలపడంతో దిగిరాక తప్పలేదు. ఇదే విధంగా మాకు అండగా వుండి మా భూములను ఆర్కే కాపాడతాడనే నమ్మకముంది.
 - కూరాకుల గంగరాజు, రైతు

Advertisement

What’s your opinion

Advertisement