రసాభాసగా మారిన శంకుస్థాపన | Sakshi
Sakshi News home page

రసాభాసగా మారిన శంకుస్థాపన

Published Sat, Oct 29 2016 1:51 AM

రసాభాసగా మారిన శంకుస్థాపన - Sakshi

- భారీ వర్షం వల్ల తీవ్ర ఇక్కట్లు
- బురదలో కూరుకుపోయిన మంత్రులు, అధికారుల వాహనాలు
 
 సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో పరిపాలనా భవనాల శంకుస్థాపన కార్యక్రమం అకాల వర్షంతో రసాభాసగా ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తున సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించారు. వేదికపై ఉన్న వారితోపాటు సమావేశానికి హాజరైన ప్రజలు తడిసి ముద్దయ్యారు. వర్షం నుంచి తప్పించుకోవడానికి కుర్చీలు, ఫ్లెక్సీలను ఆశ్రయించారు. వర్షం తగ్గకపోవడంతో కొంతమంది కుర్చీలు నెత్తిమీద పెట్టుకునే ఇంటిబాట పట్టడం విశేషం. ఇది ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీ ‘కాట్ పే’ చర్చ పేరుతో సమావేశం నిర్వహించినప్పుడు వచ్చిన వారు మంచాలు ఇంటికి తీసుకెళ్లిన సంఘటనను గుర్తు చేసిందని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు. కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో అక్కడంతా చీకటిగా మారి ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.

 సభా ప్రాంగణం బురదమయం
 భారీ వర్షం కారణంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఇతర కేంద్ర మంత్రులు రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకున్నారు. వర్షం వల్ల మంత్రులను, అధికారులను తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. అసలే నల్లరేగడి నేల కావడం, అడుగేస్తే జారిపోతుండటంతో వర్షం తగ్గే వరకూ ఎవరూ ఎటూ కదల్లేకపోయారు. వాహనాలు బురదలో కూరుకుపోవడంతో చాలాసేపు వేదికపైనే వేచి చూడాల్సి వచ్చింది. చివరకు స్పెషల్‌పార్టీ పోలీసులు రంగంలోకి దిగి బురదలో కూరుకుపోయిన మంత్రులు, అధికారుల వాహనాలను ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించారు. రాత్రి 12 గంటల వరకు కూడా చాలా వాహనాలు బయటపడలేదు. దీంతో గుంటూరు కలెక్టర్, అర్బన్ ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 
 మీటింగని తీసుకొచ్చి బురదలో వదిలేశారు
 పరిపాలనా భవనాల శంకుస్థాపన సభకు తీసుకొచ్చి తమను బురదలో, కారు చీకట్లో వదిలేశారని పలువురు మహిళలు ప్రభుత్వం, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను తీసుకొచ్చిన బస్సులన్నీ బురదలో కూరుకుపోయి, బయటకు రావడం లేదని, తమనెవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement