Sakshi News home page

ప్రభుత్వ వ్యవస్థ విఫలం

Published Wed, Dec 10 2014 12:32 AM

ప్రభుత్వ వ్యవస్థ విఫలం - Sakshi

ఆరు నెలల్లో  ప్రభుత్వం చేసింది శూన్యం
జీవీఎంసీ ఎన్నికల దృష్ట్యా విశాఖకు వస్తున్న సీఎం
{పజలను వంచించడం తప్పా.. ఒక్క హామీ నెరవేర్చలేదు
వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్

 
విశాఖ రూరల్:   ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలంలో కష్టాల్లో ఉన్న విశాఖ ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా ఫెయిలైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. మంగళవారం హోటల్ టైకూన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  తుపాను కారణంగా నష్టపోయిన ప్రజలకు ఏమీ చేయకుండానే అన్నీ చేశామన్న భావన కలిగించి ప్రజలను వంచించారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు రైతు, డ్వాక్రా రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లు, ధరల  స్థరీకరణ నిధి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ ఈ నెల 5న ధర్నా చేపట్టిన ముందు రోజు హడావుడా చంద్రబాబు 50 వేలలోపు రైతు రుణాలు మాఫీ చేస్తున్నామని ప్రకటించి, ఇప్పటి వరకు చేయలేదని, ఇప్పుడు బాండ్లు ఇస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయని, ఏ ఒక్క దానిపై స్పష్టత లేకుండా ఇవ్వకుండా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఆంధ్రాయూనివర్శిటీ, ఎయిర్‌పోర్టు, జూ తీవ్రంగా దెబ్బతిన్నాయని, అన్ని శాఖల పునర్నిర్మాణాలకు నామినేషన్ పద్ధతిన పనులకు అనుమతులిచ్చినప్పటికీ జూకు సంబంధించి ఎటువంటి నిధులు మంజూరు చేయలేదని పేర్కొన్నారు.

జీవీఎంసీ ఎన్నికలు ఉన్నాయనే..

జీవీఎంసీ ఎన్నికలు త్వరలో జరగనున్న దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ నెలా విశాఖకు వస్తున్నారన్నారు. ఆయన పర్యటనల వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌గాను, ఐటీ, టూరిజం, ఆర్థిక రాజధానులుగా చేస్తామని ఒక్కో మంత్రి మాటల గారడీలు చేస్తున్నారని, ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేపట్టలేదని ఎద్దేవా చేశారు. ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలంటే రిజర్వు బ్యాంకు, స్టాక్ ఎక్ఛేంజ్‌లు ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించి ప్రభుత్వం ఒక్కసారి కూ డా కేంద్రానికి విన్నవించిన దాఖలాలు లేవన్నారు. డిస్నీ ల్యాండ్ తెస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే తాము అటువంటి ప్రతిపాదనలు చేయలేదని ఆ సంస్థ వెబ్‌సైట్‌లో ప్రకటించిందని తెలిపారు. సీఎం, మంత్రుల మధ్య సఖ్యత లేదని, వారి మాటాలకు పొంతన లేకుండా ఉందని, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అబద్దాలు చెబుతూ, హడావుడి చేస్తూ ప్రజలను మ భ్యపెడుతున్నారని, దీనికి మూల్యం చెల్లించుకుంటారన్నారు.

సీఎం ప్రత్యేక విమనం ఖర్చెంత?: సీఎం చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక విమానంలోనే వెళుతున్నారని, ఆ ఖర్చు వివరాలు ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. చరిత్ర ఏ ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో విదేశాలకు వెళ్లిన సందర్భం లేదన్నారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ ప్రత్యేక విమానాల్లో తిరుగుతుండడం ధారుణమన్నారు.

 ప్రతీ వారం గంటాకు మూడు ప్రశ్నలు : ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు మహాధర్నాకు ముందు రోజున చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. వెంటనే తాను గంటాకు 26 ప్రశ్నలు సంధించినా ఏ ఒక్కదానికి సమాధానాలు లేవన్నారు. ఇక నుంచి వారినికి మూడు ప్రశ్నలు గంటాకు సంధిస్తానని, దమ్ముంటే సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. ‘ఉపాధ్యాయుల బది లీల్లో గంటా కుటుంబ సభ్యులు, వ్యక్తిగత కార్యదర్శులు డబ్బులు వసూలు చేసిన విషయంలో వాస్తవం లేదా? గంటా నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనేక సంస్థలు, కాలేజీల నుంచి డబ్బులు వసూలు చేయలేదా? తుపానుకు దెబ్బతిన్న ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో ఎన్నిసార్లు పర్యటించించారు? ఎంతమందిని పరామర్శించి ఆదుకున్నారు?’ అంటూ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సూచించారు. మరో మంత్రి జెండాలు ఎగురవేయడం తప్పా ఎటువంటి అజెండా లేదని విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు తిప్పల గురుమూర్తి రెడ్డి, జాన్ వెస్లీ, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త తైనాల విజయ్‌కుమార్, దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త కోలాగురువులు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పలనాగిరెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.హెచ్.ఫరూక్, సీనియర్ నాయకుడు సత్తి రామకృష్ణారెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడు జి.రవిరెడ్డి, నగర మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర యువజన కమిటీ సభ్యుడు విల్లూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

What’s your opinion

Advertisement