‘బంగారు తల్లి’కి కష్టం! | Sakshi
Sakshi News home page

‘బంగారు తల్లి’కి కష్టం!

Published Sun, Jun 15 2014 3:50 AM

‘బంగారు తల్లి’కి కష్టం! - Sakshi

  • సగం మందికి అందని మొదటి ప్రోత్సాహకం    
  •  జిల్లాలో లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు
  • ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి ఆమె ఉన్నత చదువులు పూర్తయ్యేదాకా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకానికి ఏడాది తిరగకముందే కష్టమొచ్చింది. ఆర్థికంగా బాలిక జీవితానికి భరోసా ఇచ్చే ఈ పథకాన్ని గతేడాది కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పథకంలోని లబ్ధిదారులకు అందాల్సిన నగ దు మూడు నెలలుగా ఆగిపోయింది. లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం శూన్యంగా ఉంది.
     
    పలమనేరు: ఆస్పత్రుల్లో జన్మించిన బిడ్డలకే బంగారుతల్లి పథకం వర్తిస్తుంది. చిన్నారి జన్మించిన 21 రోజుల్లోపు లబ్ధిదారులు ఐకేపీ (ఇందిరక్రాంతి పథం) కింద అవసరమైన అన్ని ధ్రువపత్రాలతో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మొదటి నెలలో లబ్ధిదారు బ్యాంకు ఖాతాలోకి ప్రోత్సాహకంగా రూ.2500లు జమవుతుంది. ఆఖరిదాకా ఈ పథకంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగితే లబ్ధిదారుకు రూ.1.55,500లు చేరుతుంది. అయితే టీకాలు వేయించడం మొదలు క్రమం తప్పకుండా చదివించాలి. ప్రతి ఏటా ఉత్తీర్ణత సాధించాలి. అన్ని నిబంధనలను పాటిస్తూ డిగ్రీ పూర్తిచేస్తే ఈ మొత్తం ఆమెకు అందుతుంది.
     
    అడుగడుగునా అవాంతరాలే
     
    బంగారుతల్లి పథకం ప్రారంభమైనప్పటి నుంచే గందరగోళం నెలకొంది. విధివిధానా ల్లో స్పష్టత లేక చాలా మందికి పథకం వర్తించకుండా పోయింది. అనంతరం సమైక్య ఉద్యమంతో కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంతంత మాత్రం గా తయారైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ వెలువడడంతో ప్రోత్సాహకాలు పూర్తిగా ఆగిపోయాయి. ఇక రాష్ట్ర విభజన, కొత్త ప్రభుత్వ ఏర్పాటు తదితర కారణాలతో మూడు నెలలుగా బ్యాంకు ఖాతాల్లోకి మొదటి నెల ప్రోత్సాహకం జమకాలేదు. దానికి తోడు సర్వర్లు సైతం పనిచేయడం లేదు.
     
    సగానికి సగం లబ్ధిదారుల ఎదురు చూపులు

    జిల్లాకు సంబంధించి 66 మండలాల్లో 12,036 మంది బంగారుతల్లి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
    వీరిలో 10,893 మంది అన్ని ధ్రువపత్రాలతో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని లబ్ధిదారులయ్యూరు. మిగిలినవి వివిధ కారణాలతో తిరస్కరింపబడ్డాయి. అయితే లబ్ధిదారుల్లో 5785 మందికి మాత్రమే మొదటి నెల ప్రోత్సాహకం అందింది. మరో 2191 మందికి త్వరలో బ్యాంకులో జమ చేయాల్సి ఉండగా ఆగింది. ఇక మున్సిపాలిటీల పరిధిలో 1869 మంది దరఖాస్తు చేసుకోగా, 1760 లబ్ధిదారులుగా ఎంపికయ్యూరు. వీరిలో 283 మందికి మాత్రం మొదటి నెల ప్రోత్సాహకంగా రూ.2500 వారి ఖాతాల్లోకి జమయ్యింది. మొత్తం మీద సగానికి సగం మంది లబ్ధిదారులకు మొదటి నెల ప్రోత్సాహకమే అందలేదు.

    రెండు నెలలుగా పథకం ఆగింది
     రెండు నెలలుగా బంగారు తల్లి పథకం పూర్తిగా ఆగిన మాట నిజమే. రాష్ట్ర విభజన కారణంగా ఈ ఇబ్బంది నెలకొంది. దానికి తోడు సర్వర్ కూడా పనిచేయడం లేదు. అంతకు ముందు ఎన్నికల కోడ్‌తో ఆగింది. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మరో 15 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులేసే అవకాశం ఉంది.
     -నరసింహా రెడ్డి, బంగారుతల్లి, డీపీఎం, డీఆర్‌డీఏ, చిత్తూరు
     

Advertisement
Advertisement