బడి బస్సు..నిబంధనలు తుస్సు | Sakshi
Sakshi News home page

బడి బస్సు..నిబంధనలు తుస్సు

Published Thu, Jun 5 2014 2:16 AM

బడి బస్సు..నిబంధనలు తుస్సు - Sakshi

 కర్నూలు, న్యూస్‌లైన్: కొత్త ఆశలు..ఆశయాలతో తమ పిల్లలను బడికి పంపిస్తున్న తల్లిదండ్రులకు పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొంది. పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు వారి కోసం కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. పాఠశాల యాజమాన్యం అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నా విద్యార్థుల భద్రత గాలిలో దీపంలా మారింది.
 
  స్కూలు బస్సుల సామర్ధ్యం(ఫిట్‌నెస్) గడువు ముగిసినప్పటికీ ఇటు యాజమాన్యాలు అటు రవాణా శాఖ అధికారుల ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డ్రైవర్ నిర్లక్ష్యం, వాహన కండీషన్ సరిగా లేని కారణంగా స్కూలు బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో వాటిలో పంపడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే రవాణా శాఖ అధికారులు హడావుడి చేయటం పరిపాటిగా మారింది.
 
 మే 15తో ముగిసిన గడుపు..
 మే నెల 15వ తేదితో జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు, కళాశాల బస్సుల ఫిట్‌నెస్ గడువు ముగిసింది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 890 బస్సులు ఉన్నాయి. వీటన్నింటికి మే 15 నుంచి జూన్ 1వ తేది మధ్యనే రవాణా శాఖ అధికారులతో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలి. అయితే ఇప్పటి వరకు ప్రైవేటు పాఠశాల యాజమాన్యం బస్సుల సామర్థ్యం(ఎఫ్‌సి)పై దృష్టి సారించలేదు. నిబంధనలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ వాహనం సీట్లను బట్టి రూ.1800 నుంచి రూ.2 వేల వరకు రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి మామూళ్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
 
 ఈనెల 2వ వారం నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అధిక శాతం పాఠశాలలు మొదటి వారంలోనే తెరుచుకున్నాయి. కేవలం వారం రోజుల గడువులో అన్ని స్కూళ్ల బస్సులకు సామర్థ్యం పరీక్షలు నిర్వహించడం అసాధ్యం. ఇప్పటికే స్కూల్ బస్సుల సామర్థ్యం మెరుగు పరుచుకుని రవాణా శాఖ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంది.
 
 విద్యా సంస్థలు తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు బస్సుల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహ కల్పించాలి. బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల వివరాలను కూడా పొందు పరుస్తూ నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలి. అందుకోసం రవాణా శాఖ అధికారులు, పాఠశాలల బస్సుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు.
 
 కండీషన్ లేకుండా బస్సులు తిప్పితే సీజ్ చేస్తాం : డీటీసీ శివరాం ప్రసాద్
 కండీషన్ లేకుండా పాఠశాల బస్సులు తిప్పితే సీజ్ చేసి యాజమాన్యాలను ప్రాసిక్యూట్ చేస్తాం. ఇందుకోసం ఈనెల 12వ తేది నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఫిట్‌నెస్ లేని బస్సులు వినియోగిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల నిర్వహకులపై చర్యలు తీసుకుంటాం. ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందాలని ఆయా స్కూళ్ల యాజమాన్యాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. లెసైన్స్ లేని డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తాం.
 
 డ్రైవర్ అర్హతలు ఇవి..
 డ్రైవర్‌కు 40 నుంచి 55 సంవత్సరాల వయస్సు ఉండాలి. పాఠశాల యాజమాన్యం డ్రైవర్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించాలి. అనుభవం, లెసైన్స్ ఉన్న వ్యక్తిని మాత్రమే నియమించుకోవాలి. డ్రైవింగ్ లెసైన్స్ తదితర అంశాలపై సంబంధిత ఆర్‌టీఏ అధికారులను సంప్రదించాలి.బస్సు డ్రైవింగ్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. డ్యూటీలో డ్రైవర్, అటెండర్ తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి
 
 ఇవీనిబంధనలు
 
మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి బస్సుకు పసుపు రంగు వేయాలి. బస్సుపై నల్ల రంగులో పెద్ద అక్షరాలతో పాఠశాల పేరును రాయించాలి.
అందరూ గుర్తించేలా బడికి వెళ్తున్న విద్యార్థుల బొమ్మలు వాహనంపై ముద్రించాలి.
పిల్లలు చేతులు బయట పెట్టకుండగా బస్సు కిటికీలకు గ్రిల్‌ను అమర్చాలి.
అనుకోని పరిస్థితుల్లో బస్సు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు చిన్నారులు ప్రమాదం నుంచి బయట పడటానికి అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయాలి.  
చిన్న పిల్లలకు బస్సుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యం చేయడానికి ఫస్ట్ ఏయిడ్ బాక్స్‌ను అందుబాటులో ఉంచాలి. అందులో స్పిరిట్, దూది, కట్టు, గాయాలకు పూసే మందు ఉండేలా చూడాలి. విద్యా సంస్థ పేరు, టెలిఫోన్ నంబర్ లేదా మొబైల్ నంబర్, పూర్తిచిరునామా బాక్సుకు ఎడమవైపు స్పష్టంగా రాయాలి.
సీట్ల కింది భాగంలో బ్యాగులు పెట్టుకునేలా అరలు ఏర్పాటు చేయాలి
చిన్న పిల్లలు బస్సు ఎక్కేటప్పడు, దిగేటప్పుడు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా చూసేందుకు సహాయకుడిని తప్పకుండా నియమించాలి.
బస్సు తలుపులు సురక్షితమైన లాకింగ్ సిస్టమ్‌తో ఉండాలి
 సైడ్ విండోలకు అడ్డంగా మూడు లోహపు కడ్డీలను ఏర్పాటు చేయాలి
సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లకూడదు.
బస్సు ఇరువైపులా వెనుక కనిపించేలా అద్దాలు ఉండాలి. అప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని మోటారు వాహనాల తనిఖీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement