అధికారపార్టీకి ఎన్నికల భయం | Sakshi
Sakshi News home page

అధికారపార్టీకి ఎన్నికల భయం

Published Mon, Apr 18 2016 1:58 AM

The threat to the ruling party's election

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలకు అన్నీ సిద్ధం చేసిన అధికారులు
సర్వేలో అధికార పార్టీకి ఎదురుగాలి ఎన్నికలు జరిపేందుకు వెనుకడుగు
పార్టీలో గ్రూపు తగాదాలతో సతమతం

 

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తిరుపతి కార్పొరేషన్ పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధికి రూ.వేల కోట్లు ఇస్తున్నా వాటిని రాబట్టుకోలేని స్థితిలో ఉంది. దీనికి కారణం కార్పొరేషన్‌కి పాలకవర్గం లేకపోవడం. అయితే ఓటమి భయంతో తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు జరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. ఏదో ఒక కారణం చూపుతూ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. తాజాగా తిరుపతి నగరపాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు సుమారు రూ.600 కోట్లకు పైగా నిలిచిపోయాయి. దీంతో నగరపాలక సంస్థ అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది.


తిరుపతి నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహిం చేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేసినా ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోంది. రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఎన్నికలు నిర్వహించేందుకు రెండు నెలల సమయం అవసరమని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల క మిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇప్పటికే పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో ఎన్నికలు జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు లోలోపల జరిగిపోయాయి.

 
సర్వేలో ఎదురుగాలి

తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై అధికారపార్టీ ఇటీవల నిఘా వర్గాలతో సర్వే చేయించినట్లు సమాచారం. ప్రస్తు తం ఎన్నికలు నిర్వహిస్తే ఎదురీత తప్పదని, ప్రజాగ్రహా నికి గురయ్యే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలు జరిపేందుకు తట పటాయిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతున్నట్లు సమాచా రం. దీంతో అధికార పార్టీ ఎన్నికలను జాప్యం చేయాల నే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు.

 
అధికార పార్టీలో గ్రూపు తగాదాలు

కార్పొరేషన్ ఎన్నికలు జరపాలని అధికార పార్టీ ఓ దశలో యోచించినా పార్టీలో గ్రూపు తగాదాలు కలవరపెడుతున్నట్లు సమాచారం. నగరంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఓ బీసీ నేత మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు సమాచారం. ఓ వర్గానికి టిక్కెట్టు ఇస్తే మరో వర్గం సహకరించదేమోననే భయం నగర నేతలను వెంటాడుతోంది. దీంతో పార్టీ అధినేతలకు అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం కంటే వాయిదా వేయడం మేలనే యోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర నిధులు ఆగిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగినా ఫర్వాలేదు కానీ ఎన్నికల్లో ఓడిపోతే పరువుపోతుందని భావిస్తున్నారని సమాచారం. సీఎం సొంత జిల్లాలో ఎదురుగాలి వీస్తే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా చూపుతుందనే భావనలో ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద నగరపాలక సంస్థ ఎన్నికలు అధికార పార్టీకి కత్తిమీద సాములా మారాయి.

Advertisement
Advertisement