జిల్లాలో గాలి వాన | Sakshi
Sakshi News home page

జిల్లాలో గాలి వాన

Published Mon, May 26 2014 1:09 AM

జిల్లాలో గాలి వాన - Sakshi

  • 10వేల ఎకరాల్లో పంటలకు నష్టం
  •      నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
  •      135 గ్రామాల్లో అంధకారం  
  •      మామిడి,అరటి రైతులు ఆందోళన
  •  అల్పపీడనం ప్రభావంతో ఆదివారం జిల్లా అంతటా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈదురు గాలుల ప్రభావంతో  అనేకచోట్ల పంటలు నేలవాలాయి. మొదళ్లతో సహా చెట్లు కూలి పోయాయి. జిల్లాలో సుమారు 10వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగి 135 గ్రామాల్లో అంధకారం అలముకుంది. విద్యుత్ అధికారు లు సైతం సహాయక చర్యలు చేపట్టలేని దుస్థితి ఉంది.  
     
    సాక్షి,విశాఖపట్నం: అల్పపీడనం జాడతో శనివారం రాత్రి నుంచి భారీ గాలులు వీస్తున్నాయి. అనేక మండలాల్లో పంటలు నేలకొరిగాయి. చెరకు, మామిడి,జీడి,అరటి,బొప్పాయి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చోడవరం,నక్కపల్లి,నర్సీపట్నం,మాడుగుల, పాయకరావుపేట, యలమంచిలి, పాడేరు, అరకు, బుచ్చయ్యపేట,నక్కపల్లి,కోటవురట్ల తదితర మండలాల్లో  మామిడి, అరటి తోటలకు అపార నష్టం వాటిల్లింది.

    ఏజెన్సీలోని జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు, అరకులోయ, అనంతగిరి, ముంచంగిపుట్టు మండలాల్లో రికార్డుస్థాయిలో వర్షంపాతం నమోదైంది. అనకాపలి ,యలమంచిలి,విశాఖసిటీ, నక్కపల్లి, పాడేరు, పరవాడ, గాజువాక తదితర ప్రాంతాల్లో భారీ గాలులకు వృక్షాలు నేలకొరగడంతో వందలాది గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి.

    పలు గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఎగువనుంచి వర్షపు నీరు శారదా నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది. ఖరీఫ్‌కు ముందే వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మెట్ట భూముల్లో అపరాలు పంటలతో పాటు కూరగాయల పంటలు చేపడుతున్నారు.  
     
    నర్సీపట్నం ప్రాంతంలో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరకు మొక్కతోటలు నేలవాలాయి.
     
    అనకాపల్లి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విజయరామరాజు పేట రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద అధికంగా నీరు చేరింది. ఈ మార్గం గూండా  బస్సులు, లారీలు తదితర భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాలి వాన బీభత్సానికి పట్టణంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల రోడ్లుకు అడ్డంగా చెట్లు కూలాయి.
     
     చోడవరం మండలం గోవాడలో తాపీ మేస్త్రీల సంఘం భవనంపై చింత చెట్టు కూలి పైకప్పు శిథిలమైంది.
     
     ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం  కోటవురట్ల మండల ప్రజలను భయాందోళనకు గురిచేసింది. సుమారు గంట పాటు ఉరుములు, మెరుపులతో పడిన వర్షం వణకుపుట్టించింది. ఈదురు గాలుల కారణంగా మండలంలో సుమారు రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. పెనుగాలులకు పలుచోట్ల చెరకుతోటలు నేలవాలాయి.
     
     పెదబయలు మండ లం కొత్త రూడకోటలో భారీవర్షం, ఈదురుగాలులకు  నారా కళ్యాణం ఇంటిపై యూకలిప్టస్  చెట్టు పడింది.  పైకప్పు  పూర్తిగా ధ్వంసమైంది.  
     
     నక్కపల్లి గాంధీనగర్‌కాలనీలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. బోదిగల్లం రోడ్డుపై ఉన్న పెద్ద వేపచెట్టు, విద్యుత్ స్తంభం కూలిపోయాయి. కొన్ని గంటలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ సిబ్బంది సమ్మెలో ఉండటంతో విద్యుత్‌సరఫరా పునరుద్ధరణకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తున్నారు. స్థానికులు రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.
     
     ఆశాజనకంగా ఖరీఫ్
     వరిసాగుకు ఖరీఫ్ కాలం అత్యంత కీలకం. ముందుగానే వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. పంటపొలాలు సిద్ధం చేయడంలో రైతులు బిజీ అయ్యారు. ఈఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 89వేల హెక్టార్లలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. మరోపక్క వర్షాలు ముందుగానే రావడంతో చాలాచోట్ల రైతులు విత్తనాల కోసం ఆరాటం మొదలయింది. కూరగాయలు, అపరాల విత్తనాల సేకరణలో రైతులు బిజీగా ఉన్నారు.
     

Advertisement
Advertisement