పోటీ చేసే నాయకులేరీ! | Sakshi
Sakshi News home page

పోటీ చేసే నాయకులేరీ!

Published Wed, Jan 8 2014 4:59 AM

there are no leaders from congress party

కర్నూలు, న్యూస్‌లైన్: శాసనసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. నాయకులు, కార్యకర్తల నుంచి చేపట్టిన అభిప్రాయ సేకరణకు మొదటి రోజు స్పందన కొరవడింది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు ఏఐసీసీ నుంచి రాహుల్‌గాంధీ దూతగా కర్ణాటక రాష్ట్రం ఉడిపి ఎమ్మెల్యే ప్రమోద్ మద్వరాజ్, పీసీసీ నుంచి జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ తిప్పేస్వామి మంగళవారం కర్నూలుకు వచ్చారు.

 కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులు, కార్యకర్తలతో జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్యతో కలిసి అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలను విడివిడిగా కలిసి అభిప్రాయాలను సేకరించారు. నియోజకవర్గాల వారీగా గుర్తించిన నాయకులను డీసీసీ కార్యాలయానికి రావాల్సిందిగా పిలుపు వెళ్లినప్పటికీ స్పందన కొరవడింది.

 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, మునిసిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, జిల్లా పార్టీ కార్యవర్గ ప్రతినిధులు, పార్టీ సీనియర్లను ఆహ్వానించారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మినహా పార్టీ ముఖ్యులు ఎవరూ కూడా హాజరు కాలేదు.  ఎమ్మిగనూరులో ప్రస్తుతం వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నందున అందుకు ధీటైన అభ్యర్థి ఎవరున్నారని ఆరా తీశారు. ఎమ్మిగనూరు నుంచి రుద్రగౌడ్, సూర్యనారాయణతో పాటు మరికొంత మంది కార్యకర్తలు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే కోడుమూరులో కోట్ల అనుచరుడు మురళీకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, రేపల్లె సూర్యచంద్ర తదితరులు ఏఐసీసీ పరిశీలకుని ఎదుట హాజరై వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతూ దరఖాస్తులు ఇచ్చుకున్నారు.

శాసనమండలి సభ్యుడు సుధాకర్‌బాబు అనుచరులు కొంతమంది హాజరై కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఎస్సీలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. డీసీసీ తరఫున సర్దార్‌బుచ్చిబాబు మాత్రమే హాజరై తన వాదనను చెప్పుకున్నారు. అలాగే కర్నూలు నగరానికి సంబంధించి మైనార్టీ నాయకులు సలాం, నౌషద్, సలీం, చున్నుమియ్య తదితరులు కర్నూలు సీట్‌ను మైనార్టీలకు కేటాయించాలని కోరారు. మంత్రి టీజీ వెంకటేష్ అనుచరులు ఎవరూ మొదటి రోజు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 9వతేదీ వరకు డీసీసీ కార్యాలయం నుంచే నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని వారు సమీక్షించనున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న బృందానికి ఈనెల 13వ తేదీన నివేదిక ఇస్తున్నట్లు పరిశీలకులు వెల్లడించారు. 

Advertisement
Advertisement