Sakshi News home page

బీజేపీ మాట నిలబెట్టుకునే టైమొచ్చింది: పవన్ కల్యాణ్

Published Mon, Feb 23 2015 5:23 PM

బీజేపీ మాట నిలబెట్టుకునే టైమొచ్చింది: పవన్ కల్యాణ్ - Sakshi

* కొత్త రాజధాని నిర్మాణంలో జీవనం ధ్వంసం కాకూడదు
* రైతులు కన్నీరు పెట్టకుండా చూసుకోవాలి
* లేదంటే వారి ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది
* ట్విట్టర్లో పవన్ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై టాలీవుడ్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట నిలబెట్టుకుంటుందనే అనుకుంటున్నానని ఆయన అన్నారు. గత ఏడాది పార్లమెంటులో గందరగోళ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లును నెగ్గించుకుందని, దానికి బీజేపీ కూడా మద్దతు తెలిపిందని అన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మాట ఇచ్చిందని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో మాట నిలబెట్టుకునే సమయం బీజేపీకి వచ్చిందని ఆయన తన ట్విట్టర్ వ్యాఖ్యలలో పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణం, భూసేకరణ అంశాల మీద కూడా ట్విట్టర్లో తెలుగులోనే పవన్ కల్యాణ్ మరికొన్ని వ్యాఖ్యలు పెట్టారు. రైతులు కన్నీరు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని, లేదంటే వారి ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని అన్నారు. కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభత్వంపై ఉందన్నారు. ఎంతో నమ్మకంతో ప్రజలు టీడిపి - బీజేపి కూటమి ని గెలిపించారు, వారి చూపించిన  నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని  ఆశిస్తున్నానని చెప్పారు.

గత కొన్నాళ్లుగా జనసేన పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ బీజేపీ మీద నమ్మకం ఉందనే అంటున్నారు. ప్రశ్నించడానికే తాను వచ్చానన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడంలేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలు సంధించడం గమనార్హం.

 

Advertisement

What’s your opinion

Advertisement