వ్యాపారి కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

వ్యాపారి కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్ట్

Published Fri, Aug 29 2014 1:14 AM

Three arrested for kidnapping trader case

ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) :  చేపల వ్యాపారి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి క్వాలీస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఏలూరు వన్‌టౌన్ సీఐ సీహెచ్ మురళీకృష్ణ చెప్పారు. వన్‌టౌన్ పోలీస్‌స్టే షన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కోల్‌కతాకు చెందిన అజయ్‌కుమార్ సాహు చేపల వ్యాపారం చేస్తుంటాడు. ఏలూరు, పరిసర ప్రాంతాలలో చేపలను కొనుగోలు చేసేందుకు ఈ ఏడాది జాన్ 26న ఏలూరు వచ్చి వన్‌టౌన్‌లోని ఒక లాడ్జిలో బసచేశాడు.
 
 ఇతను గతంలో గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన సేరు శ్రీనివాసరావుకు చేపల కొనుగోలు నిమిత్తం రూ.12 లక్షలను చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బును రాబట్టుకునేందుకు సేరు శ్రీనివాసరావు మరో నలుగురు వ్యక్తుల సహాయంతో క్వాలిస్ వాహనంలో లాడ్జికు వచ్చి అజయ్‌కుమార్ సాహును 26న సాయంత్రం కిడ్నాప్ చే శారు. అజయ్‌కుమార్ సాహుతో పాటు ఏలూరు వచ్చిన అతని సోదరుడు సంజయ్‌కుమార్ సాహుకు ఈ విషయం తెలిసి 27న ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం గుంటూరు జిల్లా రేపల్లెలోని సేరు శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ చేయగా,
 
 అక్కడే ఉన్న అజయ్‌కుమార్ సాహును విడిపించి కిడ్నాప్‌కుపాల్పడిన శ్రీనివాసరావు, కొక్కిరిగడ్డ శివశంకరరావులను జూన్ 1న అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు నిందితులు రేపల్లెకు చెందిన కంచర్ల ప్రభు, జ్యోతి బాబు, విజయవాడకు చెందిన కారుడ్రైవర్ పసుపులేటి రామకృష్ణ పరారయ్యారు. బుధవారం సాయంత్రం ఏలూరు పాత బస్టాండ్ వద్ద క్వాలిస్ వాహనంలో తిరుగుతున్న ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి క్వాలిస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరుస్తామని సీఐ వివరించారు.
 

Advertisement
Advertisement