పొగాకు మార్కెట్ పతనం | Sakshi
Sakshi News home page

పొగాకు మార్కెట్ పతనం

Published Wed, Jul 16 2014 4:38 AM

పొగాకు మార్కెట్ పతనం - Sakshi

కొండపి: నిన్నమొన్నటి వరకూ పర్వాలేదు అనుకున్న పొగాకు మార్కెట్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఒక్క రోజులోనే కొండపి వేలం కేంద్రంలో కేజీకి రూ.10 పైగా ధర తగ్గింది. దీంతో రైతులు ఆందోళనకు దిగి వేలాన్ని అడ్డుకున్నారు. స్థానిక పొగాకు వేలంకేంద్ర అధికారి మురళీధర్ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

మొదటగా 48 బేళ్లు కొనుగోలు చేశాక సరైన ధర రాలేదని పచ్చవ, కామేపల్లి గ్రామాలకు చెందిన రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వేలాన్ని అపాలని మురళీధర్‌ను కోరారు. దీంతో వేలాన్ని ఆపిన మురళీధర్ వ్యాపారులు, రైతులతో మాట్లాడి తిరిగి కొనుగోళ్లు ప్రారంభించారు. మరో ఆరు బేళ్లు కొనుగోలు చేసిన తరువాత ధరల విషయంలో మార్పు రాలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో అర్ధగంట పాటు అక్కడే రైతులు, వ్యాపారులు, అధికారుల మధ్య సంవాదం చోటుచేసుకుంది.
 
శని, సోమవారాల్లో 80 శాతానికి పైగా నంబర్ పొగాకును క్వింటా రూ.11,500 నుంచి రూ.11,800 వరకు కొనుగోలు చేయగా, అదే రకం పొగాకును రెండు రోజులు తరువాత రూ.10,500 నుంచి రూ.11,000లోపే కొనుగోలు చేయటం ఏమిటని రైతులు ప్రశ్నించారు. వేలంకేంద్రం రైతు నాయకుడు బొడ్డపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఒక్కరోజులోనే వెయ్యి రూపాయలకు పైగా మార్కెట్ దిగకోస్తే ఎట్లా అని అధికారులను నిలదీశారు. దీనిపై ఆగ్రహించిన ఫీల్డ్ అసిస్టెంట్ మురళీ బ్రహ్మయ్యపైకి ఆవేశంగా వచ్చారు. దీంతో అక్కడే ఉన్న రైతులు బోర్డు అధికారి దుందుడుకు చర్యకు నిరసనగా ఆర్‌అండ్‌బీ రహదారిపై బైఠాయించారు.
 
రైతు నాయకుడు బ్రహ్మయ్యపైకి క్షేత్రసహాయకుడు రావటం సరికాదని, వ్యాపారులు మాయాజాలంతో ధరలు తగ్గించి కొనటం అన్యాయం అని నినదించారు. అర్ధగంటకు పైగా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలను అక్కడే ఆగిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులు, బోర్డు అధికారులతో మాట్లాడి సంయమనంపాటించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో రైతులు శాంతించి రాస్తారోకో విరమించారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు ధరల విషయంపై వేలం కేంద్రానికి వచ్చి ఆరా తీశారు. రైతులకు న్యాయం చేసేలా చూడాలని వేలం కేంద్రం అధికారులను కోరారు.

Advertisement
Advertisement