నేడే.. పల్లె ఫలితాలు | Sakshi
Sakshi News home page

నేడే.. పల్లె ఫలితాలు

Published Tue, May 13 2014 3:00 AM

today mptc, zptc results

మూడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
ఒక టేబుల్‌లో ఓ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు
ఒక్కో రూములో ఆరు టేబుళ్లు
మధ్యాహ్నంలోపు ఎంపీటీసీ ఫలితాలు
సాయంత్రానికల్లా జెడ్పీటీసీ ఫలితాలు
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఏర్పాట్లను పరిశీలించిన జెడ్పీ సీఈఓ మాల్యాద్రి
    
 
 కడప :
 ప్రతిష్టాత్మకంగా సాగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలపై ఉత్కంఠతకు మంగళవారంతో తెరపడనుంది. జిల్లాలో రెండు విడతల్లో ఏప్రిల్ 6, 11 తేదీల్లో 535 ఎంపీటీసీ స్థానాలు, 50 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ బరిలో 1695 మంది అభ్యర్థులు, జెడ్పీటీసీ బరిలో 237 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే 24 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.  రాజంపేట డివిజన్‌కు సంబంధించి శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో, కడప డివిజన్ లెక్కింపు కేశవరెడ్డి స్కూలులో, జమ్మలమడుగు డివిజన్ లెక్కింపు మదీనా ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 50 మండలాలకు సంబంధించి మూడు కౌంటింగ్ కేంద్రాలలో 50 రూములలో ఒక్కొక్క రూముకు ఆరు టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఎంపీటీసీ ఫలితాల లెక్కింపును ఒక్కో టేబుల్‌పైన చేపడతారు. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపులో   ఒక్కో రౌండ్‌కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం లోపే వెల్లడి కానున్నాయి. జెడ్పీటీసీ ఫలితాలు సాయంత్రంలోగా రానున్నాయి. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు.
 
కౌంటింగ్ కేంద్రాలకు ఆరు గంటల్లోపే బాక్సుల తరలింపు
కొత్త కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్ రూములో ఎంపీటీసీ, జెడ్పీటీసీ  
 

 బ్యాలెట్ పత్రాలను భద్రపరిచారు. వీటిని ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్వోల నేతృత్వంలో ఉదయం 3 నుంచి ఆర్టీసీ డీజీటీల ద్వారా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూములకు చేరుస్తారు. వీటిని తరలించే సమయంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ ఏజెంటుతోపాటు అభ్యర్థినిమాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థి ఆర్వో వద్ద ఉంటే కౌంటింగ్ సరళిని ఏజెంటు పరిశీలిస్తారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక సూపర్‌వైజర్‌తోపాటు ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద 400 మందికి పైగా పోలీసులను మోహరిస్తున్నారు. 2200 మందికి పైగా సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు. కడప డివిజన్‌కు సంబంధించి కౌంటింగ్ కేంద్రంలో బందోబస్తు ఏర్పాట్లను కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి పరిశీలించారు.

 కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జెడ్పీ సీఈఓ

 కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపునకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా జెడ్పీ సీఈఓ మాల్యాద్రి తమ సిబ్బందితో మూడు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. లెక్కింపు సందర్బంగా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సంబంధిత డీఎస్పీలతో బందోబస్తుపై చర్చించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన వసతులపై సిబ్బందితో ఆరా తీశారు. కౌంటింగ్ రోజున ఓట్ల లెక్కింపును జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎన్నికల పరిశీలకులు మురళీధర్‌రెడ్డి, బాల దిగంబర్, జేసీ రామారావు, ఏజేసీ సుదర్శన్‌రెడ్డితోపాటు సంబంధిత మూడు రెవెన్యూ డివిజన్ల అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్వోలు పర్యవేక్షిస్తారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement