పాపం పండుతుందా! | Sakshi
Sakshi News home page

పాపం పండుతుందా!

Published Fri, Aug 21 2015 1:49 AM

Traders nuts chemicals

రసాయనాలతో కాయలు మాగబెడుతున్న వ్యాపారులు
తింటే ప్రమాదకరమైన రోగాలు         
అమ్మతనమూ కోల్పోయే ప్రమాదం
హైకోర్టు ఆదేశాలతోనైనా అధికారుల్లో కదలిక వచ్చేనా?

 
జిల్లాలో పండ్ల వ్యాపారం అనారోగ్యానికి కేంద్రంగా మారింది. వ్యాపారులు విషపూరిత రసాయనాలను కలిపి  24 గంటల్లోనే పచ్చటి కాయల్ని పండ్లుగా మార్చేస్తున్నారు. డబ్బిచ్చి కొనుక్కున్న పాపానికి వినియోగదారుడికి అనారోగ్యాన్ని అంటగడుతున్నారు. వీటిని తింటే రోగాలే రావడమే కాకుండా  అమ్మతనమూ కోల్పోయే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. పండ్లలో రసాయనాలు కలపడంపై హైకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న రసాయన పండ్ల అమ్మకాలపై స్పెషల్ ఫోకస్..
 
పలమనేరు: మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే రోజువారీ ఆహారంలో పండ్లు తినాలని నిపుణులు చెబుతుంటారు. ఇదంతా గతం. ఇప్పుడు జిల్లాలోని పండ్ల మార్కెట్‌లో దొరికే కొన్ని రకాల పండ్లను తింటే మనిషికి ఆరోగ్యమేమో గానీ అనారోగ్యం మాత్రం తప్పదు. పచ్చికాయలను సైతం రసాయనాలతో మాగ బెట్టేస్తుండడంతో ఇవి ప్రజల పాలిట శాపంగా మారాయి. ప్రస్తుతం జిల్లాలోని పలు పట్టణాల్లో ఇదే తంతు. పలురకాల కాయలను పండ్లుగా చేసి జనానికి అమ్మేస్తున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, పలమనేరు, వి.కోట, కుప్పం, పుంగనూరు, మదనపల్లె తదితర పట్టణాల్లో పచ్చి కాయలను రసాయనాలతో మాగబెట్టే గోడౌన్లు ఉన్నాయి. బెంగళూరు, చెన్నై నుంచి వ్యాపారులు ఇక్కడికి కాయలను  తీసుకొస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని ఈ గోడౌన్‌కు తరలించి వాటిని మాగబెట్టడానికి నిర్ణీత రుసుం చెల్లిస్తారు. 24 గంటల్లోపు  కాయలు పండ్లుగా మారుతున్నాయి. వీటిని పట్టణాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కాయలను ఊదర ప్రక్రియ, బోధ కసువులో పెట్టి మాగబెట్టడం లాంటి పాత పద్ధతులు ఇప్పుడు కనిపించడం లేదు.  

ఇదీ తతంగం..
 గోడౌన్‌కు తరలించిన అరటి, మామిడి కాయలను మొదట మ్యాంకోజబ్-45 (ఎం.-45), అనే పౌడర్‌ను ఒక లీటరు నీటికి ఒక మిలీ చొప్పున వేస్తారు. ఆ నీటిలో ఈ పచ్చి కాయలను ముంచి పక్కన బెడతారు. తర్వాత ఇథాలీన్ అనే బిళ్లలను నీటిలో వేస్తే దాని నుంచి గ్యాస్ వస్తుంది. ఓ గదిలో కాయలను ఉంచి ఈ గ్యాస్‌ను వదిలి ఆ గదిలోకి గాలిపోకుండా చేస్తారు. మరోవైపు వేపర్ ట్రీట్‌మెంట్ పేరిట కాయలను బందీ చేసిన గదుల్లోకి విషపూరితమైన మిథైల్ గ్యాస్‌ను వదిలి పెడతారు. దీంతో 20  నుంచి 24 గంటల్లోనే పచ్చి కాయలు రంగు మారి పండ్లుగా తయారవుతాయి. మామిడి కాయలను అపాయకర కాల్షియం కార్భైట్‌లతో మాగబెడతారు. పండ్లు పూర్తి విషపూరితంగా మారుతున్నాయి. ఎక్కువ మోతాదులో ఈ పండ్లను తిన్న నాలుగైదు గంటల్లోపు వాంతులు, విరేచనాలు అవుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానికి తోడు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లలకు వ్యాధులుసోకే అవకాశం ఎక్కువని వైద్యులు అంటున్నారు.

 పట్టించుకునే నాథుడే లేరు
 ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ విషపూరితమైన రసాయనాలతో కాయలను మాగబెట్టి జిల్లాలోని వివిధ కేంద్రాల్లో పెద్దఎత్తున విక్రయిస్తున్నారు.  పట్టణాల్లోని మున్సిపల్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, ఆహార కల్తీ నిరోధక శాఖ ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ వారు స్పందించడం లేదు. మదనపల్లె, చిత్తూరు, తిరుపతిల్లో ఉండే ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు వచ్చి తనిఖీ చేసిన దాఖలాలు అస్సలు లేవు. పండ్లలో రసాయనాల కలపడంపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర హైకోర్టు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని గట్టిగా ఆదేశించింది. దీంతోనైనా అధికారులు స్పందిస్తారేమో చూడాలి.
 
 

Advertisement
Advertisement