గురువుల్లో గుబులు | Sakshi
Sakshi News home page

గురువుల్లో గుబులు

Published Sat, Sep 26 2015 1:32 AM

transfer teachers



 ఏలూరు సిటీ :సర్కారు బడుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీ గుబులు పట్టుకుంది. ఒకవైపు పాయింట్ల కేటాయింపులో లోపాలు అయోమయానికి గురి చేస్తున్నాయి. మరోవైపు  విద్యా సంవత్సరం మధ్యలో బది లీలు చేపడితే ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. వేసవి సెలవుల్లో బదిలీలు, క్రమబద్ధీకరణ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా పట్టించుకోని ప్రభుత్వం ఆకస్మికంగా షెడ్యూల్ ప్రకటించటం విమర్శల పాలైంది. ఆన్‌లైన్ విధానంతో గందరగోళానికి గురవుతున్నామని కొందరు ఉపాధ్యాయులు వాపోతున్నారు.
 
 అభ్యంతరాల స్వీకరణ గడువు నేటితో పూర్తి
 జిల్లాలోని జెడ్పీ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న 5,144 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. డీఈవో డి.మధుసూదనరావు వాటిని పరిశీ లించి 4,753 దరఖాస్తులను పరిష్కరించారు. సీనియార్టీ జాబితా, తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, ఏవైనా అభ్యంతరాలుంటే శనివారం సాయంత్రం 5గంటల్లోగా ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని డీఈవో సూచించారు.
 
 ఆమోదించిన దరఖాస్తుల సంఖ్య ఇలా
 బదిలీలకు సంబంధించి ఆమోదించిన దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి. జెడ్పీ యాజమాన్యంలో పనిచేస్తున్న 4,689 మందితోపాటు ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న 64 మంది ఉపాధ్యాయులకు సంబంధించి
 
 మొత్తం 4,753 ఆన్‌లైన్ దరఖాస్తులను డీఈవో ఆమోదించారు. ఇందులో గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు 180 మంది, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో గణితం ఉపాధ్యాయులు 414 మంది, ఫిజికల్ సైన్సు టీచర్లు 294 మంది, బయోలాజికల్ సైన్సు టీచర్లు 291 మంది, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు 273 మంది ఉన్నారు. ఫిజికల్ డెరైక్టర్లు 13 మంది, తెలుగు ఉపాధ్యాయులు 129 మంది, హిందీ ఉపాధ్యాయులు 122 మంది, ఇంగ్లిష్ టీచర్లు 312 మంది, సంస్కృతం ఏడుగురు, ఉర్ధూ ఉపాధ్యాయుడు ఒకరు ఉన్నారు. వీరితోపాటు ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులు 160 మంది, పీఈటీలు 144 మంది, డ్రాయింగ్ టీచర్లు 105 మంది, సెకండరీ గ్రేడ్ ఉర్ధూ ఉపాధ్యాయులు 16 మంది, సెకండరీ గ్రేడ్ తెలుగు ఉపాధ్యాయులు 1,945 మంది, భాషాపండిట్ తెలుగు ఉపాధ్యాయులు 147 మంది, భాషా పండిట్ హిందీ ఉపాధ్యాయులు 125 మంది, భాషాపండిట్ సంస్కృతం ఉపాధ్యాయులు ముగ్గురు, క్రాఫ్ట్ టీచర్లు ఏడుగురు7, ఒకేషనల్ టీచర్ ఒకరు ఉన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో పీఈటీలు 10మంది, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ టీచర్లు 8 మంది, హిందీ ఉపాధ్యాయులు ఆరుగురు, తెలుగు ఉపాధ్యాయుడు ఒకరు, పీడీ ఒకరు, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు ఆరుగురు, బయోలాజికల్ సైన్సు టీచర్లు 8 మంది, ఫిజికల్ సైన్స్ టీచర్లు 13, గణితం ఉపాధ్యాయులు 11మంది ఉన్నారు.

 పాయింట్ల కిరికిరి
 ఉపాధ్యాయుల సర్వీస్, వారు పనిచేసే ప్రాంతం, ప్రత్యేక కేటగిరీ, ఆరోగ్య పరిస్థితులు ఇలా 11అంశాలకు సంబంధించి పాయింట్లు కేటాయిస్తున్నారు. వీటిని ఎంఈవోలు, డీవైఈవోలు ధ్రువీకరించాల్సి ఉండటంతో ఉపాధ్యాయులకు చిక్కులు వచ్చిపడ్డాయి. తాము ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లినా విద్యాశాఖ అధికారులు పాయింట్లు కేటాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాయింట్లు కేటాయింపులో లోపాలు చోటుచేసుకుంటే బదిలీల్లో ప్రాధాన్యత కోల్పోతామని వాపోతున్నారు. అభ్యంతరాలకు సైతం మరోమారు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సి రావటం ఇబ్బందిగా మారిందంటున్నారు. అభ్యంతరాలు స్వీకరించి లోపాలను సవరించేందుకు సరైన నిబంధనలు లేవంటున్నారు. విద్యాసంవత్సరం మధ్యలో బదిలీ చేస్తే వేరేచోటుకు వెళ్లటం కష్టమని, పిల్లల చదువులు, ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement