‘వలస గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తాం’ | Sakshi
Sakshi News home page

‘వలస గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తాం’

Published Sun, Nov 9 2014 12:38 AM

tribal Problems Dealt

 వై.రామవరం :వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ డొంకరాయి పరిసర గ్రామాల్లో శనివారం వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంతబాబు అధ్యక్షతన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పర్యటించారు. వారి వెంట వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మొదట డొంకరాయి గ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పర్యటన ప్రారంభించారు. రాజు క్యాంపు, బెంగాలీ క్యాంపు, మర్రిగూడ, బచ్చలూరు, నర్సింగ్‌పూర్, తదితర గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో గిరిజన సంప్రదాయం ప్రకారం వారికి ఆయా గ్రామాల ప్రజలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతు బొడ్డగండి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.  మండల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస గిరిజనుల సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. అనంతరం అనంతబాబు మాట్లాడుతు ఆయా గ్రామాల్లోని వలస గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బతుకు తెరువుకోసం ఇక్కడకు దశాబ్దాల క్రితం వలసి వచ్చిన గిరిజనులందరికీ భూమి పట్టాలు, పక్కా ఇళ్లు, కులధ్రువీకరణ పత్రాల మంజూరుకు ఎమ్మెల్యే తోపాటు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  
 
 పింఛన్ల పునరుద్ధరణకు పోరాడుతా
 రుణమాఫీ పేరుతో టీడీపీ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని మంగంపాడు, డొంకరాయి గ్రామాల్లో శనివారం ‘జన్మభూమి-మాఊరు’ సభలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజేశ్వరి మాట్లాడుతూ  పింఛన్ల పెంపు పేరుతో అర్హుల పింఛన్లు తొలగించడంపై ఆమె ధ్వజమెత్తారు. అనేక మంది పింఛన్లు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ పింఛన్లు పునరుద్ధరించే వరకు వైఎస్సార్ సీపీ తరఫున పోరాడుతామని ఆమె హామీ ఇచ్చారు. డొంకరాయి, పొల్లూరు, సీలేరు ఏపీ జెన్‌కో జల విద్యుత్ కేంద్రాల కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
 

Advertisement
Advertisement