కబళించిన మృత్యువు | Sakshi
Sakshi News home page

కబళించిన మృత్యువు

Published Tue, Apr 21 2015 3:46 AM

two died in Road accident

మండపేటలో రోడ్డు ప్రమాదం
 మోటారు సైకిల్‌ను
 ఢీకొట్టిన కారు
 ఇద్దరు తాపీమేస్త్రులు మృతి
 
 మండపేట/ మండపేట రూరల్ :మండపేటలోని రామచంద్రపురం కెనాల్ రోడ్డులో వీరభద్రపురం వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలోని మృతులు మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన వాకాడ శ్రీను (23), చుక్కా శ్రీను (32)గా స్థానికులు గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి మోటారు సైకిల్‌పై వెళుతున్న వారిని భీమవరం నుంచి కాకినాడ వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వాకాడ శ్రీను తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందగా చుక్కా శ్రీను తీవ్ర గాయాలతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
 
 వారం రోజుల తర్వాత పనికి..
 మండపేట మండలం వెలగతోడు బీసీ కాలనీకి చెందిన వాకాడ శ్రీను, చుక్కా శ్రీనులు తాపీపని చేస్తుంటారు. వరుసకు ఇద్దరూ అన్నదమ్ములు. గత వారం రోజులుగా తమ సోదరి వివాహ వేడుకతో సందడిగా గడిపారు. పనికి కూడా వెళ్లకుండా పెళ్లి పనులన్నీ దగ్గరుండి చక్కబెట్టారు. వారం రోజుల తర్వాత తిరిగి ఇద్దరూ కలిసి ఆదివారం అనపర్తి మండలం పొలమూరులో తాపీపని చేసేందుకు వెళ్లారు. ఆదివారం రాత్రి కూలీలకు డబ్బులు చెల్లించి స్వగ్రామానికి బయలుదేరడంతో జాప్యం జరిగినపట్టు స్థానికులు తెలిపారు. పల్సర్ వాహనంపై ఇద్దరూ వెలగతోడు వెళుతుండగా మండపేటలోని వీరభద్రపురం వద్దకు వచ్చేసరికి భీమవరం నుంచి అనపర్తి వైపు వెళుతున్న సతీష్ దంపతుల కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మోటారు సైకిల్‌ను నడుపుతున్న వాకాడ శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. చుక్కా శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. కారు పక్కనే ఉన్న పంటబోదెలోకి దూసుకుపోయి బోల్తాకొట్టింది. రోడ్డున వెళుతున్న వారు కారులో ఇరుక్కుపోయిన సతీష్ దంపతులను బయటకు తీయడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన చుక్కా శ్రీనును చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
 
 వెలగతోడులో విషాదఛాయలు
 చుక్కా శ్రీనుకు భార్య రమణతో పాటు మూడేళ్ల వయసున్న శ్రావణి, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరికి కూలిపనే ఆధారం. శ్రీను పనికి వెళితేనే కుటుంబ పోషణ జరిగేది. భర్త మరణంతో భార్య రమణ బోరున విలపిస్తోంది. మరో మృతుడు వాకాడ శ్రీను ఇంటికి ఆధారం. కూలిపనితోనే తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. కుమారుడి మృతితో అతడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. త్వరలో వివాహం చేద్దామనుకుంటుంటే ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందంటూ వారు విలపిస్తున్న తీరు చూపరులకు కంటతడిపెట్టిస్తోంది. వెలగతోడు బీసీ కాలనీలో విషాదం అలముకుంది. మండపేట అర్బన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement