‘అనంత’కు అన్యాయం | Sakshi
Sakshi News home page

‘అనంత’కు అన్యాయం

Published Sat, Jul 6 2019 6:17 AM

In The Union Budget, The State Has Suffered unfair Injustice The Center Has Neglected The Development Of A Completely Backwards - Sakshi

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. నిధుల కేటాయింపులో మరోసారి మొండిచేయి చూపింది. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ జిల్లా వాసులను నిరాశపరిచింది. జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బెల్, సెంట్రల్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ అకాడమీ, ఎనర్జీ యూనివర్సిటీలకు నిధులు కేటాయించకపోవడంపై జిల్లావాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి రాష్ట్రానికి సంజీవనిగా భావిస్తున్న ప్రత్యేకహోదా ఊసు లేకపోవడం అందరినీ నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌ ధరలపై లీటరకు రూ.1 సెస్‌ విధించడం, బంగారం, ఇతర విలువైన ఆభరణాలపై కస్టమ్స్‌ సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడంపై మధ్యతరగతి పెదవి విరుస్తోంది. అయితే వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆర్థికమంత్రి తెలపడం, ఆ జాబితాలో ‘అనంత’ పేరు ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. మొత్తమ్మీద కొన్ని వర్గాలకు వెసులుబాటు మినహా సామాన్యులకు ఈ బడ్జెట్‌లో పెద్దగా లబ్ధి కల్గించే ప్రకటనలు లేవు. అలాగే జిల్లా అభివృద్ధికి కూడా దోహదపడే అంశాలు లేకపోవడం గమనార్హం.      – సాక్షి ప్రతినిధి, అనంతపురం

‘అనంత’ అభివృద్ధిని విస్మరించారు                          
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. పూర్తిగా వెనుకబడిన ‘అనంత’ అభివృద్ధిని కేంద్రం విస్మరించింది. ఆర్థికాభివృద్ధి సాధించామని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నా...పేద కుటుంబాల్లో ఎలాంటి మార్పు రాలేదు. జాతీయ సంపద పంపిణీ సరిగా జరగడం లేదు. బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే కార్పొరేట్‌ వర్గాలకే మేలు జరిగేలా ఉంది.  
– తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ   

బుక్కరాయసముద్రం మండలంలోని జంతులూరు వద్ద ఏర్పాటు చేయనున్న సెంట్రల్‌ వర్సిటీకి ఈ బడ్జెట్‌లో కేంద్రం ఆశించినంత మేర నిధులు విడుదల చేయలేదు. కేవలం రూ.13 కోట్లు కేటాయించడంతో ఆ నిధులన్నీ జీతాలు, నిర్వహణకే సరిపోతాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. భవన నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాకపోవడంతో సెంట్రల్‌ వర్సిటీ తరగతులు జేఎన్‌ టీయూలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
  
సాక్షిప్రతినిధి, అనంతపురం: కేంద్ర బడ్జెట్‌ నిరాశ పరిచింది. ‘అనంత’కు తీరని అన్యాయం జరిగింది. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా పెట్రోలు, డీజిల్‌లపై లీటర్‌కు రూపాయి సెస్‌ విధిస్తున్నట్లు    ఆర్థికమంత్రి ప్రకటించారు. ఇది కాకుండా ఇతర పన్నులు కలిపి లీటర్‌పై రూ.2.50 వరకూ అదనంగా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం అన్ని రంగాలపై చూపే అవకాశం ఉంది.
 
హోదాను విస్మరించారు 
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకహోదాపై ఆశలు పెట్టుకుంది. హోదా ప్రకటిస్తే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా మేలు జరిగే ప్రాంతం అనంతపురమే. హోదా ఇస్తే పరిశ్రమలు ఏర్పాటైæ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కేంద్ర బడ్జెట్‌లో హోదా ప్రస్తావన లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించే  అంశం. ఇక దేశవ్యాప్తంగా వెనుకబడిన 150 జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కేంద్రం ప్రకటించింది. అందులో అనంతపురం జిల్లాను కూడా చేర్చడం జిల్లా వాసులకు కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే జిల్లా అభివృద్ధికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారు? పరిశ్రమలు, ఇతర రంగాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.
 
కొత్తగా ఇళ్లు నిర్మించుకునేవారికి శుభవార్త 
2022నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే మధ్యతరగతి ప్రజలు రూ.45 లక్షల వరకూ రుణం తీసుకుంటే అందులో రూ.3.50 లక్షల వడ్డీ రాయితీ ఇస్తామని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. గతంలో ఈ రాయితీ రూ.2 లక్షలే ఉండేది. ఇప్పుడు రూ.1.50 లక్షలు అదనంగా రాయితీ ఇచ్చారు. అలాగే ఉద్యోగులకు ఏడాదికి రూ.5 లక్షల వార్షికాదాయం ఉంటే ఎలాంటి ఆదాయపు పన్ను లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే పన్ను చెల్లింపుదారులకు మాత్రం ఊరట లభించలేదు.  రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్యలో ఆదాయం కలిగి పన్ను చెల్లించేవారు ఇకపై 3 శాతం అదనంగా సర్‌చార్జ్‌ చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 కోట్లుపైన ఆదాయం ఉంటే 7 శాతం సర్‌చార్జ్‌ చెల్లించాలి.
 
రూ.లక్ష వరకూ ముద్ర రుణాలు 
కేంద్రం ప్రభుత్వం ఇది వరకే అమలు చేస్తున్న ‘ముద్ర’ యోజన ద్వారా మహిళలకు రూ.లక్ష వరకూ రుణాలు ఇస్తామని కేంద్రం బడ్జెట్‌ సందర్భంగా ప్రకటించింది. దీంతో మహిళలకు ఊరట కల్గనుంది.  అలాగే స్వయం సహాయ సంఘాల్లోని మహిళలకు కూడా రూ.5 వేల ఓవర్‌డ్రాప్ట్‌ ఇవ్వనున్నారు. ఇక సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రాయితీలు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే జిల్లాలో ఏటా రూ.5 వేల కోట్లపైనే రైతులు వ్యవసాయ రుణాలు తీసుకోనుండగా.. వీరు సకాలంలో చెల్లిస్తే రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన వారికి రుణాలు రీషెడ్యూలు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. జిల్లాలో సెంట్రల్‌యూనివర్సిటీ స్థాపిస్తున్నారు. దీనికి గత బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో రూ.13 కోట్లు కేటాయించారు. బెల్, సెంట్రల్‌ కస్టమ్స్‌ అండ్‌ఎక్సైజ్‌ అకాడమీ, ఎనర్జీ యూనివర్సిటీలకు ఎలాంటి కేటాయింపులు బడ్జెట్‌లో లేవు. మొత్తం మీద  బడ్జెట్‌లో  సామాన్యులకు పెద్దగా లబ్ధికల్గించే ప్రకటనలు లేవు. 

సామాన్యుడి నడ్డివిరిచేలా ఉంది  
కేంద్ర బడ్జెట్‌ సామాన్యుని నడ్డివిరిచేలా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ఉపయోగం లేకపోగా తీవ్ర అన్యాయం జరిగింది. విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తకపోవడం దారుణం. పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచుకుంటూ పోవడం ద్వారా అన్ని రకాల చార్జీలు పెరుగుతాయి. దీని ప్రభావం సామాన్యులపై పడుతుంది. కేంద్ర బడ్జెట్‌లో దుగ్గిరాజ పట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్ల ప్రస్తావన రాకపోవడం దారుణం.    – వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ 

గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారు 
గ్రామీణాభివృద్ధికి, జలసంరక్షణకు పెద్ద పీట వేశారు. ఏపీ విద్యారంగానికి సంబంధించి ఏపీ సెంట్రల్‌ వర్సిటీకి రూ.13 కోట్లు, గిరిజన వర్సిటీకి రూ.8 కోట్లు కేటాయించారు. పరిశోధనలకు సంబంధించి ప్రత్యేక కమిషన్‌ (నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ) ఏర్పాటు స్వాగతించాల్సిన అంశం. అయితే రెవెన్యూ లోటును పూడ్చడానికి గానీ, కొత్త రైల్వే లైను ప్రతిపాదనలు లేవు. పెట్రోల్, డీజిల్‌ రేట్లు పెంచడం నిరాశపరిచింది. ఉన్నత విద్య, పాఠశాల విద్యకు కేటాయింపులు మెరుగ్గా ఉంటే బాగుండేది. గృహ రుణాలపై వడ్డీ రాయితీ స్వాగతించే అంశం. ఆదాయపన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు. చిల్లర వ్యాపారులకు ప్రధానమంత్రి కర్మయోగ మాన్‌ధన్‌ ,హర్‌ ఘర్‌ జల్‌ , ఒకే దేశం ఒకే కార్డు , ప్రవాస భారతీయులకు ఆధార్‌కార్డు , ప్రధాన మంత్రి ఘర్‌ యోజన ఆకర్షణీయ పథకాలుగా ఉన్నాయి.       –డాక్టర్‌ డి. మురళీధర్‌ రావు , అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఎస్కేయూ 

నిరాశ పర్చిన బడ్జెట్‌ 
కేంద్ర బడ్జెట్‌ భారత ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టినట్టు లేదు. వ్యవసాయ రంగ సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆశాజనకంగా లేదు. బడ్జెట్‌ నిరాశ పరిచింది. మోదీ సర్కార్‌ బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఎన్నికల్లో రాజకీయాలను, ప్రజలను మేనేజ్‌ చేసుకోవచ్చు, ప్రజల ప్రేమాభిమానం లేకపోయినా ఫర్వాలేదు అనే అభిప్రాయంతో కొనసాగుతున్నట్లు కనబడుతోంది.             – ఇమామ్, కదలిక ఎడిటర్‌ 
                 
కార్పొరేట్‌ వర్గాలకే అనుకూలం 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కార్పొరేట్‌ వర్గాలకే అనుకూలంగా ఉంది. 44 కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబ్‌ కోడ్‌లుగా మారుస్తున్నట్లు ప్రకటించడం ఇందులో భాగమే. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాలను రూ.1.50 లక్షల కోట్లు ఉపసంహరించి.. వాటిని ప్రైవేటు పెట్టుబడులకు బదిలీ చేస్తామడం దారుణం. వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తూ యాజమాన్యంతో సహా ప్రైవేటుకు కట్టబెడుతోంది.               –వి.రాంభూపాల్, సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి 

Advertisement

తప్పక చదవండి

Advertisement