పోరు.. హోరు | Sakshi
Sakshi News home page

పోరు.. హోరు

Published Thu, Sep 5 2013 3:58 AM

united movement in the district.

 సాక్షి, కడప :  జిల్లాలో సమైక్య ఉద్యమం రగులుతోంది.   లక్షలాది మందితో సభలు నిర్వహిస్తూ  సమైక్య ఆకాంక్షను బలంగా వినిపిస్తున్నారు. నిరసన సెగలు ఢిల్లీకి తాకేలా  నినదిస్తున్నారు,  జమ్మలమడుగులో  బుధవారం లక్ష మందితో జనగర్జన నిర్వహించారు.  మొత్తం మీద 36వ రోజు కూడా   సమైక్య హోరుతో జిల్లా దద్దరిల్లింది.
 
  కడపలో వైఎస్సార్ సీపీ నేతలు డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, కోటా నరసింహారావు  చేస్తున్న ఆమరణ దీక్షలు  బుధవారంతో మూడవ రోజు పూర్తయ్యాయి. వీరి దీక్షలకు జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎస్‌బీ అంజాద్‌బాష, బద్వేలు వైఎస్సార్‌సీపీ నేతలు చిత్తా ప్రతాప్‌రెడ్డి, రవిప్రకాశ్‌రెడ్డి, ఓ.ప్రభాకర్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి  సంఘీభావం తెలిపారు.
 
 ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో కడప పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏడురోడ్లకూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఉస్మానియా ఘటనకు నిరసనగా రిమ్స్‌లో వైద్యులు విధులను బహిష్కరించి రిమ్స్ డెరైక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.  మున్సిపల్ కార్మికులు రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టి ఆటాపాటా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పలు శాఖల ఉద్యోగులు రిలే దీక్షల్లో కూర్చొన్నారు.  మదీనా ఇంజినీరింగ్ కళాశాల సిబ్బంది  రిలే దీక్షల్లో పాల్గొన్నారు.  విద్యుత్, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, డీఆర్‌డీఏ, వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
 
  జమ్మలమడుగులో జన గర్జన పేరుతో నిర్వహించిన సభకు జనం పోటెత్తారు.  ఢిల్లీకి సెగ తగిలేలా  నినాదాలతో హోరెత్తించారు. జేఏసీ చైర్మన్, ఆర్డీఓ రఘునాథరెడ్డి అధ్యక్షతన  ఈ కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి  సభకు హాజరై తమ సంఘాభావాన్ని తెలిపారు. ఎర్రగుంట్ల, ఆర్టీపీపీలలో రిలే దీక్షలు కొనసాగాయి.
 
  ప్రొద్దుటూరు పట్టణంలో రెడ్డీస్ సేవా సంఘం, చిలంకూరు వైద్య సిబ్బంది, వైద్యులు, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగాయి. మోడమీదపల్లె  ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్, పాఠశాలల యాజమాన్యాలు, 700 మందికి పైగా విద్యార్థులు, ప్రజలు సైకిళ్లలో  24 కిలోమీటర్ల మేర అన్ని వీధులు కలియతిరిగారు. గురువారం లక్ష మందికి పైగా జనాలతో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూలులో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పొలికేక  నిర్వహిస్తున్నారు.
 
  పులివెందుల జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీఓలు, ఉపాధ్యాయులు, ధర్మ ప్రచార పరిషత్ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారాన్ని నిర్మించి భజన చేశారు. వేంపల్లె,సింహాద్రిపురంలో ఆందోళనలు కొనసాగాయి.
  మైదుకూరులో వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మానవహారం నిర్వహించారు. ఖాజీపేటలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వీరికి మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి సంఘీభావం తెలిపారు.
 
  రైల్వేకోడూరులో ఉద్యోగ, ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర ప్లకార్డులు చేతబూని ప్రతిజ్ఞ చేశారు. వీరికి ఎన్జీఓలు, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు, సిబ్బంది సంఘీభావం తెలిపి  ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు.
 
  రాజంపేటలో  యాదవ సంఘం ఆధ్వర్యంలో  భారీ ర్యాలీ  నిర్వహించారు. శ్రీకృష్ణుని వేషధారణలో సోనియాగాంధీకి సమైక్యాంధ్రగా ఉంచాలని రాయబారం పంపారు. చెక్కభజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఐకేపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. విద్యార్థి జేఏసీ నాయకులు విష్ణువర్దన్‌నాయక్ చేపట్టిన ఆమరణ దీక్ష ఐదవ రోజుకు చేరింది.
 
 రాయచోటి పట్టణంలో వైద్యులు ఉస్మానియా ఆస్పత్రిలో జరిగిన ఘటనకు నిరసనగా నల్లబ్యాడ్జీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఓపీ సేవలు నిలిపి వేశారు. అత్యవసర సేవలను మాత్రమే అందించారు. ఆదర్శ రైతులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల పాఠశాల విద్యార్థినిలు రోడ్డుపైనే యోగాసనాలు చేసి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. న్యాయవాదుల దీక్షలు కొనసాగాయి.
 
  బద్వేలులో గానుగపెంట, కాల్వపల్లె గ్రామాలకు చెందిన రైతులు ర్యాలీగా వచ్చి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు  ర్యాలీ చేపట్టి పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పోరుమామిళ్ల పట్టణంలో ప్రైవేటు పాఠశాలల వారు  బంద్ పాటించి రిలే దీక్షలకు మద్దతు తెలిపారు.  నరసాపురంలో ముస్లింలు వంటా వార్పు చేపట్టారు.
 
  కమలాపురంలో ఎల్‌ఐసీ ఏజెంట్ల ఆధ్వర్యంలో సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మలను గ్రామ చావిడి నుంచి కమలాపురం క్రాస్ రోడ్డు వరకు ఊరేగించారు. రోడ్డుపైన మానవహారంగా ఏర్పడి బైఠాయించారు. మండల జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బస్సు యాత్ర చేపట్టి విభజన వల్ల కలిగే నష్టాలను వివరించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement