‘వర’ప్రసాద్ | Sakshi
Sakshi News home page

‘వర’ప్రసాద్

Published Wed, Sep 11 2013 3:14 AM

United soldier fell. State divided

 సమైక్య సిపాయి నేలకొరిగాడు. రాష్ట్రం ముక్కలవుతుందంటే  జీర్ణించుకోలేకపోయిన ఓ ఉపాధ్యాయుడు పోరుకు సిద్ధమయ్యాడు. మిత్రులతో కలసి ఉద్య  మంలో చురుగ్గా పాల్గొంటూనే రోడ్డు ప్రమాదంలో మృత్యువొడికి చేరాడు.
 
 ఆ సమయంలోనూ మృత్యువుతో పోరాడుతున్న వారికి తన అవయవాలనుదానం చేసి అమరుడయ్యాడు.తల్లిదండ్రులకు ఏ దేవుడి‘వరప్రసాద’మో కానీ.. చనిపోయాక కూడా అవయవ
 ‘ప్రసాద’ంతో మరికొందరికి జీవితాల్లో వెలుగు నింపాడు కొలిమిగుండ్ల జెడ్పీ హైస్కూల్‌లో
 ఫిజికల్ డెరైక్టర్‌గా పని చేస్తున్న కొలిపాక వరప్రసాద్(44).
 
 పత్తికొండ అర్బన్/కొలిమిగుండ్ల న్యూస్‌లైన్: వరప్రసాద్ స్వస్థలం పత్తికొండ. డిగ్రీ వరకు ఇక్కడే చదివిన ఆయన కర్నూలులో బీఎడ్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎస్జీటీ టీచర్‌గా పత్తికొండలోనే ఉద్యోగంలో చేరారు. అయితే బీపీడీ సర్టిఫికెట్ ఉండటంతో క్రాస్ ప్రమోషన్‌కు కొలిమిగుండ్ల జెడ్పీ హైస్కూల్‌కు ఫిజికల్ డెరైక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈయనకు భార్య సుజాత, కుమారుడు వసంత్‌కుమార్, కుమార్తె దివ్య సంతానం. యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టడంతో మనస్తాపం చెందాడు. ఈ కోవలో సాగుతున్న ఉద్యమాల్లో తన వంతు పాత్ర నిర్వహిస్తున్నాడు.
 
 అందులో భాగంగానే ఈనెల 1వ తేదీన సమైక్యాంధ్ర ఉద్యమ ర్యాలీలో పాల్గొనేందుకు కోవెలకుంట్లకు బైక్‌పై బయలుదేరారు. కార్యక్రమం ముగిసిన వెంటనే తిరుగు ప్రయాణమైన ఆయన.. రామాపురం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి బండి పైనుంచి పడిపోయాడు. ఆ సమయంలో ఓ బండ రాయి తలకు తగలడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆయన వెనుక వస్తున్న స్నేహితులు గుర్తించి తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెదడుకు బలమైన గాయాలైనట్లు గుర్తించారు. వారి సూచనతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. 7వ తేదీ సాయంత్రం వరకు వరప్రసాద్ మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఆయనను రక్షించేందుకు శాయశక్తులా కృషి చేసిన వైద్యులు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్‌లోని నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోని జీవన్‌ధాన్ సంస్థ ప్రతినిధులు అవయవదానం కోసం ఎదురుచూస్తున్న వారి దీనగాథలను కుటుంబ సభ్యులకు సచిత్రంగా వివరించారు.
 
 చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగు నింపుతాడని తెలిసి అందుకు వారూ అంగీకరించారు. ఆ మేరకు వరప్రసాద్‌కు కృత్రిమ శ్వాస అందించడం ద్వారా మూత్రపిండాలు, గుండె కవాటాలు, కాలేయం, మరికొన్ని అవయవాలను సేకరించారు. సోమవారం ఆయన మృతదేహానికి స్వగ్రామమైన పత్తికొండలో అంత్యక్రియలు నిర్వహించారు. ఏదేమైనా వరప్రసాద్ ప్రాణం తీయడంలో మృత్యువు పైచేయి సాధించినా.. అవయవ దానంతో మరికొందరికి జీవన దానం చేసి భౌతికంగా పునర్జన్మను పొందడం ఆ మృత్యువే చిన్నబోయేలా చేసింది.
 

Advertisement
Advertisement