మోగుతూనే ఉన్న సమైక్య నగారా | Sakshi
Sakshi News home page

మోగుతూనే ఉన్న సమైక్య నగారా

Published Tue, Nov 5 2013 2:35 AM

మోగుతూనే ఉన్న సమైక్య నగారా - Sakshi

 సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో ఎగసిన జనోద్యమం వరుసగా 97వరోజైన సోమవారం నాడూ ఉధృతంగా సాగింది.  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో న్యాయవాదులు సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను కొద్దిసేపు అడ్డుకున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు  కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. విశాఖ జిల్లా చోడవరంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.  పశ్చిమగోదావరి జిల్లా  ఏలూరు లో జెడ్పీ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.  కృష్ణాజిల్లా కలిదిండి సెంటరులో  సమైక్యవాదులు దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒంగోలులో విద్యార్థులు  కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఎంఆర్‌పీఎస్ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని సీమాంధ్ర ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్న మందకృష్ణ సీమాంధ్రలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.


 వైఎస్సార్ సీపీ శ్రేణుల అలుపెరుగని పోరు
  సమైక్యాంధ్రకు ఆది నుంచి కట్టుబడిన రాజకీయ పార్టీగా నిరశన దీక్షలు, విభిన్నరూపాల్లో ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు నిర్విరామపోరు సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ సోమవారం నాడూ సమైక్యఉద్యమాన్ని హోరెత్తించింది. సీమాంధ్ర జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. విశాఖ కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ నేత కోలా గురువులు ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రం విడిపోతే తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఎండుచేపలను సేవ్ ఏపీ ఆకారంలో ప్రదర్శిం చారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో రోడ్డుపై మోకాళ్లపై నిలబడి పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గుంటూరు నగరంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఇక గత నెల 2వతేదీ నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గకేంద్రాల్లో పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి.
 

Advertisement
Advertisement