మంత్రి, ఎమ్మెల్యేకు సమైక్య సెగ | Sakshi
Sakshi News home page

మంత్రి, ఎమ్మెల్యేకు సమైక్య సెగ

Published Sat, Nov 16 2013 3:29 AM

untited agitation become severe in Ananthapuram district

కదిరి/అనంతపురం రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు, గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తాలకు సమైక్య సెగ తగిలింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం కదిరిలో కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి సోదరుడు నవీన్‌కుమార్‌రెడ్డి వివాహానికి మంత్రి రఘువీరా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి బయటకు రాగానే జేఏసీ నాయకులు జేవీ రమణ, వేణుగోపాల్‌రెడ్డితో పాటు మరికొందరు మంత్రిని అడ్డుకుని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దీంతో తాను కూడా సమైక్యవాదినేనని, అయితే బాధ్యత గల హోదాలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
 
 రానున్న ఎన్నికల్లోపు తెలంగాణపై ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకోకుండా తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కచ్చితంగా తెలంగాణ ఏర్పాటు కాదని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. దీంతో విభజనను అడ్డుకోవడంలో సీమాంధ్ర మంత్రులు విఫలమయ్యారని, వారిలో మీరు కూడా ఒకరని జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఇదే సమయంలో వైఎస్‌ఆర్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి మంత్రిని కలిసి సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవాలని కోరారు.
 
 నగరంలో వాగ్వాదం..
 అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో ‘రాయల తెలంగాణ’ అంశంపై మీడియా సమావేశం నిర్వహించి బయటకు వస్తున్న డీసీసీ జిల్లా అధ్యక్షుడు, గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తాను ఎస్కేయూ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుని తోపులాట జరిగింది. ఈ క్రమంలో ప్రెస్‌క్లబ్‌లోని స్టాండ్ విరిగిపోయింది. ఈ సందర్భంగా కొట్రికెకు, ఎస్కేయూ సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ సదాశివరెడ్డి, విద్యార్థి జేఏసీ నేతలు పరశురాం నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
 
 ఓ సందర్భంలో సహనం కోల్పోయిన కొట్రికె.. మీడియా సమక్షంలోనే పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పెద్దలకు ఏ మాత్రం తెలీకుండా కేంద్రం తెలంగాణ ప్రకటన చేసి మోసం చేసిందని కొట్రికె చెప్పగానే.. వర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిందని చెబుతున్న పార్టీలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. దీంతో తాను ఇప్పటికే రాజీనామా చేశారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఆగ్రహంతోనే డీసీసీ కార్యాలయంలో కాకుండా ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించానన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ పార్టీ ముందుకొచ్చినా పూర్తి మద్దతిస్తానన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ఆయనతో మాట్లాడానని, సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న జగన్‌కు తన మద్దతు ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని వదలి వస్తే చంద్రబాబుకు కూడా మద్దతిస్తానన్నారు.
 
 
 అనంతరం ఎస్కేయూ జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, అందులో అన్ని పార్టీలు సమైక్యాంధ్ర తీర్మాణం చేయాలని సదాశివరెడ్డి చెప్పడంతో అందుకు ఎమ్మెల్యే సరేనన్నారు. కొట్రికెను అడ్డుకున్న వారిలో జేఏసీ నేతలు పులిరాజు,వెంకటేష్, లక్ష్మినారాయణ, సోమేష్‌కుమార్ తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement